ఆర్సీబీకి బిగ్ షాక్.. చినస్వామి స్టేడియం పెద్ద ఈవెంట్లకు పనికి రాదని తేల్చిచెప్పిన జస్టిస్ కున్హా కమిషన్

ఆర్సీబీకి బిగ్ షాక్.. చినస్వామి స్టేడియం పెద్ద ఈవెంట్లకు పనికి రాదని తేల్చిచెప్పిన జస్టిస్ కున్హా కమిషన్

బెంగుళూరు: బెంగుళూరులోని చినస్వామి స్టేడియం పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహించడానికి పనికి రాదని జస్టిస్ జాన్ మైఖేల్ డి'కున్హా కమిషన్ తేల్చింది. ఈ మేరకు కర్నాటక ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించింది. కాగా, 2025 ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ నిలవడంతో 2025, జూన్ 4న బెంగుళూర్‎లోని చినస్వామి స్టేడియం వద్ద విక్టరీ పరేడ్, ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‎కు అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువ మంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా.. 50 మంది గాయపడ్డారు.

ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న కర్నాటక హైకోర్టు.. విచారణ కోసం జస్టిస్ జాన్ మైఖేల్ డి'కున్హా నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ జాన్ మైఖేల్ డి'కున్హా తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ రిపోర్టులో ప్రధానంగా చినస్వామి స్టేడియంలోని లోపాలను ఎత్తిచూపారు. చిన్నస్వామి స్టేడియం పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించడానికి సురక్షితం కాదని పేర్కొన్నారు. 

‘‘స్టేడియం రూపకల్పన, నిర్మాణం సామూహిక సమావేశాలకు సురక్షితం కాదు. స్టేడియం అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు రోడ్డు ఫుట్‌పాత్‌లకు అనుసంధానించారు. ఎంట్రీ గేట్ వద్ద జనసమూహం కోసం విశాలమైన ప్రాంతం లేదు. దీంతో ప్రేక్షకులు ఫుట్‌పాత్ లేదా రహదారిపై క్యూలో నిలబడవలసి వస్తోంది. ఇది పాదచారులు, వాహనదారులకు ఇబ్బంది కల్గిస్తోంది. దుండగులు నేరుగా స్టేడియంలో వచ్చే అవకాశం ఉంది. స్టేడియానికి సరైన భద్రతా నిర్వహణ లేదు. దీనికి తగ్గట్టుగా స్టేడియంలో మార్పులు చేసే వరకు చినస్వామి స్టేడియంలో పెద్ద పెద్ద ఈవెంట్లు కండక్ట్ చేయడం సేఫ్ కాదు” అని జస్టిస్ జాన్ మైఖేల్ డి'కున్హా రిపోర్టులో పేర్కొన్నారు. 

కాగా, బెంగుళూరు తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యం, డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, పోలీసుల నిర్లక్ష్యమే కారణమని.. తొక్కిసలాటకు పూర్తిగా వీళ్లే బాధ్యత వహించాలని జస్టిస్ జాన్ మైఖేల్ డి'కున్హా ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే  జస్టిస్ డి'కున్హా నివేదికకు కర్నాటక కేబినెట్ ఆమోదం తెలిపి.. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతోంది. ఆర్సీబీ హోంగ్రౌండ్ చినస్వామి స్టేడియం పెద్ద పెద్ద ఈవెంట్లకు పనికి రాదని జస్టిస్ కున్హా కమిషన్ తేల్చిచెప్పడంతో ఈ విషయంలో కర్నాటక సర్కార్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.