శ్మశానవాటికలపై ప్రభుత్వ కుట్రను తిప్పికొడతాం..​ చెన్నయ్య

శ్మశానవాటికలపై ప్రభుత్వ కుట్రను తిప్పికొడతాం..​ చెన్నయ్య

సికింద్రాబాద్/ఖైరతాబాద్, వెలుగు: హైదరాబాద్​సిటీలో విలాసవంతమైన ప్రాంతాల్లో ఉన్న శ్మశాన వాటికలను అభివృద్ధి చేసి.. మహాప్రస్థానం పేరుతో ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టే  ప్రభుత్వ కుట్రను తిప్పి కొడతామని మాల ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య హెచ్చరించారు. బేగంపేట శ్మశాన వాటికలో ఉన్న బ్యాగరులను ఖాళీచేయాలని ఆదేశించడాన్ని నిరసిస్తూ  జీహెచ్ఎంసీ  సికింద్రాబాద్​ జోనల్​ కమిషనర్​ ఆఫీస్​ వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు.  ధర్నా అనంతరం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి  వినతిపత్రం ఇచ్చారు. బ్యాగరులు శ్మశాన వాటికలనే నమ్ముకుని బతుకుతున్నారని, అలాంటి వారిని ఉన్న ఫలంగా ప్రభుత్వం ఖాళీ చేయించేందుకు పూనుకోవడం సరైంది కాదన్నారు. 

శ్మశాన వాటికలను ప్రైవేటు  ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నాలు ప్రభుత్వం మానుకోవాలన్నారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చెన్నయ్య మీడియాతో మాట్లాడారు. ఈనెల 19న కమిషనర్​శ్రీనివాస్​రెడ్డి బ్యాగరులను ఖాళీచేయాలని ఆదేశించారని, దీంతో మనస్తాపనికి గురైన మాధవి అనే మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిందని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెన్నయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో జేఏసీ నాయకులు పద్మాకర్, గాజుల నాగరాజు, ఏనుబోతుల అనిల్, బైండ్ల  శ్రీనివాస్, రామాంజనేయులు, పెగడ రమేశ్​, జనార్దన్, శ్రీనివాస్, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.