అమెరికా ఇరాన్ ఒప్పందంతో సంబంధం లే.. హిజ్బుల్లాను అంతం చేసేదాకా ఆగం: ఇజ్రాయెల్

అమెరికా ఇరాన్ ఒప్పందంతో సంబంధం లే.. హిజ్బుల్లాను అంతం చేసేదాకా ఆగం: ఇజ్రాయెల్

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటుంది అనుకుంటే.. సరిగ్గా ఇక్కడే ఇజ్రాయెల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆ డీల్‌తో తమకు సంబంధం లేదని.. లెబనాన్ సరిహద్దుల నుంచి తమ సైన్యాన్ని వెనక్కి పిలిచే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెలిజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. అంతేకాదు ఇరాన్ కు నరనరాల్లో వణుకు పుట్టించేలా ఒక గట్టి వార్నింగ్ కూడా జారీ చేశారు. 

డీల్ మీది.. వార్నింగ్ మాది
అమెరికా, ఇరాన్ దేశాలు యుద్ధానికి ఎండ్‌కార్డ్ వేస్తూ ఒప్పందం చేసుకున్నప్పటికీ.. తమ దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా తుడిచిపెట్టే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని ఆర్మీ ప్రకటించింది. శాంతి ఒప్పందం పేరుతో ఇరాన్ గనుక మళ్లీ హిజ్బుల్లాకు ఆయుధాలు సరఫరా చేయడానికి ప్రయత్నిస్తే.. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని, నేరుగా ఇరాన్ గుండెల్లోకి దూసుకుపోతామని టెహ్రాన్‌ను ఇజ్రాయెల్ హెచ్చరించింది.

గ్లోబల్ మార్కెట్లలో టెన్షన్
ఇజ్రాయెల్ ప్రకటనతో ఇరాన్-యుఎస్ డీల్ వల్ల క్రూడాయిల్ ధరలు తగ్గి మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయనే ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఇజ్రాయెల్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఒకవైపు అమెరికా శాంతిని కోరుకుంటుంటే.. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం తన సరిహద్దు భద్రత కోసం ఒంటరి పోరాటానికైనా సిద్ధమని సిగ్నల్స్ ఇస్తోంది. మొత్తానికి తెరవెనుక ఇరాన్-అమెరికా హ్యాండ్‌షేక్ చేసుకున్నా.. తెరముందు మాత్రం ఇజ్రాయెల్ తన 'వార్ మోడ్'ను ఆఫ్ చేయడానికి అస్సలు సిద్ధంగా లేదనే ప్రకటనలు చిక్కులను కొనసాగిస్తున్నాయి.