హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో చిన్నచిన్న రిపేర్లు, ఎక్విప్ మెంట్ మెయింటెనెన్స్ కోసం నిధుల కొరత లేకుండా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్స్‌కు వచ్చే రాజీవ్ ఆరోగ్యశ్రీ క్లెయిమ్స్ మొత్తంలో డిడక్ట్ చేసే 20 శాతాన్ని.. ఇకపై నేరుగా హాస్పిటల్స్ బాగోగుల కోసమే (ఓ అండ్ ఎమ్) వాడాలని డిసైడ్ అయ్యింది. ఆ 20% నిధులను రివాల్వింగ్ ఫండ్ కింద డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఖాతాకే నేరుగా రిలీజ్ చేయాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ ఆదేశాలిచ్చారు. గతంలో ఉన్న జీవో నంబర్ 6ను పక్కాగా అమలు చేస్తూ ఈ నిధులను హాస్పిటల్స్ మౌలిక సదుపాయాల డెవలప్ మెంట్, పరికరాల రిపేర్ల కోసమే వాడాలని స్పష్టం చేశారు.
కొత్త కాలేజీల.. నిధుల కష్టాలకు చెక్
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రులు పెరగడంతో డీఎంఈ పరిధి విస్తరించింది. దీంతో ఆయా ఆసుపత్రుల్లో నిర్వహణ భారం పెరిగింది. ఫ్యాన్లు తిరగకపోయినా, స్కానింగ్ మెషీన్లు పనిచేయకపోయినా నిధుల కోసం పైకి చూడాల్సిన పనిలేకుండా.. ఆరోగ్యశ్రీ నిధులను వాడుకునే వెసులుబాటు కల్పించారు. పెరిగిన ఆసుపత్రుల నెట్ వర్క్ ను దృష్టిలో పెట్టుకుని క్వాలిటీ సర్వీస్ అందించేందుకే ఈ 20 శాతం నిధులను డీఎంఈకి మళ్లిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది.
