ఏకపక్షంగా ప్రైవేటు ప్రాక్టీస్ రద్దు

ఏకపక్షంగా ప్రైవేటు ప్రాక్టీస్ రద్దు

ఎవరి అభిప్రాయమూ తీసుకోకుండానే ఏకపక్షంగా.. కొత్తగా చేరే ప్రభుత్వ వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీస్ ను  రద్దు చేయడం సరికాదని వైద్య సంఘాలు గళమెత్తాయి.  ఈ నిర్ణయం వల్ల  వైద్యులతో పాటు ప్రజలు కూడా ఇబ్బందిపడతారని పేర్కొన్నాయి.  కొత్తగా చేరే ప్రభుత్వ  వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీస్ ను  రద్దు చేస్తూ తెలంగాణ సర్కారు ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనిపై తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, మెడికల్ టీచింగ్ అసోసియేషన్, ఐఎంఏ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ వైద్యుల అసోసియేషన్, హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్  అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.  ప్రైవేటు ప్రాక్టీస్ రద్దు వల్ల కొత్తగా వచ్చే డాక్టర్లకు స్కిల్స్ తగ్గిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు వైద్య సంఘాల తో చర్చించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్య సంఘాలతో చర్చించి జీవో లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. 

ఎయిమ్స్ తరహా జీతాలిస్తే ఓకే..

‘‘ కొత్తగా వచ్చే వైద్యులకు ఆప్షన్ ఇవ్వాలి.. వాళ్లు ఒప్పుకుంటే ప్రైవేటు ప్రాక్టీస్ లేకుండా..  ఒకవేళ కావాలనుకుంటే ఉండేలా కనీసం ఆప్షన్ అయినా ఇవ్వాలి’’ అని వారు కోరారు.  ఎయిమ్స్,నిమ్స్ లాంటి ఆస్పత్రులలో ఎలాంటి వసతులు, జీతాలు ఉన్నాయో.. అదేవిధంగా తమకూ ఇవ్వడానికి సిద్ధమైతే ప్రైవేటు ప్రాక్టీస్ రద్దుకు ఒప్పుకుంటామని వైద్య సంఘాలు స్పష్టం చేశాయి. ‘‘టైం టు టైం పనిచేయడానికి మేము నాన్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కాదు.. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ఉన్నాం’’ అని ఈసందర్భంగా వైద్యవర్గాలు వ్యాఖ్యానించాయి. ‘‘కాంట్రాక్టు బేసిస్ మీద  వచ్చే వైద్యులకు లక్షల్లో జీతం ఉంది. మాకెందుకు లేదు ? అడ్మినిస్ట్రేషన్ లో చాలా లోపాలు ఉన్నాయి. పై స్థాయిలో ఉన్న వైద్య అధికారులు ఏళ్ల తరబడి పదవుల్లో ఉంటున్నారు. నిమ్స్ డైరెక్టర్ టర్మ్ అయిపోయినా.. అక్కడే ఉండి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు.  ఆస్పత్రులలో పై స్థాయి వైద్యులకు ఉన్న వసతులు.. కింది స్థాయి వాళ్లకు అందడం లేదు. అలాంటప్పుడు ఎలా 24 గంటలు అందుబాటులో ఉండాలి’’ అని వైద్యులు ప్రశ్నించారు. ‘‘ క్వాలిటీ కంట్రోల్, మెడికల్ ఆఫీసర్లలో ఎక్కడా ప్రొఫెసర్లు, సీనియర్లు కనిపించడం లేదు. మందుల విషయంలోనూ మాఫియా పుట్టుకొచ్చింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా  హరీష్ రావు బాధ్యతలు చేపట్టిన తరువాత మార్పు మొదలైంది’’ అని పేర్కొన్నారు.