13 జిల్లాల స్పౌజ్ పంచాయితీని తెంపే ప్రయత్నంలో సర్కారు

13 జిల్లాల స్పౌజ్ పంచాయితీని తెంపే ప్రయత్నంలో సర్కారు
  • 615 మంది స్కూల్ అసిస్టెంట్లకే బదిలీలు?
  • మిగిలిన బాధిత టీచర్లకు డిప్యూటేషన్లు ఇచ్చే చాన్స్

హైదరాబాద్,వెలుగు: బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో స్పౌజ్ పంచాయితీని ముగించేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం పలు మార్గాలను వెతుకుతోంది. మొత్తం బాధితుల్లో కొందరికి ట్రాన్స్​ఫర్లు చేసి, మరికొందరిని డిప్యూటేషన్​పై ఆయా జిల్లాలకు పంపించాలని భావిస్తోంది. ఇందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అయితే దీనిపై ఆయా జిల్లాల స్పౌజ్ టీచర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల జిల్లాలు, జోన్ల అలకేషన్​ కోసం ప్రభుత్వం గతేడాది డిసెంబర్​లో  317జీవో తీసుకొచ్చింది. హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన 32 జిల్లాల్లో ఈ ప్రక్రియ జరిగింది. 19 జిల్లాల్లో సుమారు 2400 మందికి స్పౌజ్ కేటగిరి కింద బదిలీలు చేపట్టారు. కానీ 13 జిల్లాల్లో పోస్టులు తక్కువగా ఉన్నాయనే కారణంతో ఈ ప్రక్రియను నిలిపివేశారు. ఇలా బ్లాకింగ్​ కు గురైన జిల్లాల జాబితాలో హనుమకొండ, వరంగల్,  రంగారెడ్డి, మేడ్చల్​, కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, ఆదిలాబాద్, మంచిర్యాల,  నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్​ ఉన్నాయి. ఈ జిల్లాల్లో తొలుత 2,566 అప్లికేషన్లు రాగా కొందరికి రివర్స్ స్పౌజ్ ద్వారా బదిలీ కాగా, మ్యూచువల్ ట్రాన్స్​ఫర్లు అయ్యారు. ప్రస్తుతం ఇంకో 2100 దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి. అయితే తమకూ బదిలీలు నిర్వహించాలని ఏడాది కాలంగా ఆయా జిల్లాల స్పౌజ్ టీచర్లు ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టరేట్ల నుంచి ప్రగతిభవన్​ దాకా అన్నిచోట్లా వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. తమ పిల్లలతో కలిసి నిరసనల్లో పాల్గొంటున్నారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీనే అమలు చేయాలని వారు డిమాండ్​చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమస్యను పరిష్కరించే యోచనలో తెలంగాణ సర్కారు పడింది. 

కొందరు స్కూల్ అసిస్టెంట్లకు ట్రాన్స్​ఫర్లు.! 

ప్రస్తుతమున్న అప్లికేషన్లలో 900 వరకూ స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరిలో సుమారు 615 మందిని ఆయా జిల్లాల్లో సర్దుబాటు చేయాలని సర్కారు యోచిస్తోంది. ఇవన్నీ కూడా ప్రమోషన్ పోస్టుల్లో నింపాలని భావిస్తోంది. అయితే ఎస్​ఏ కేటగిరిలోనూ ఇంకో మూడు వందల మందికి మొండిచేయి చూపించే అవకాశముంది. వీరితో పాటు మిగిలిన ఎస్​జీటీలు, లాంగ్వేజీ పండిట్లు, పీఈటీ, ఎల్​ఎఫ్​ఎల్ హెడ్మాస్టర్ అభ్యర్థులను డిప్యూటేషన్​పై పంపించాలని యోచిస్తోంది. అయితే గతంలో 1,656 మందిని ట్రాన్స్​ఫర్లు చేస్తామని ప్రభుత్వం చెప్పిందని.. తాజాగా ఆ సంఖ్యను 615కు తగ్గించారని బాధిత టీచర్లు చెప్తున్నారు. బాధిత టీచర్లలో చాలామందికి ఇంకా 20 ఏండ్లపైనే సర్వీస్ ఉందనీ, కానీ డిప్యూటేషన్​ కేవలం 2,3 ఏండ్లు ఇచ్చే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే సర్కారు ఇలాంటి లీక్​లు ఇస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.  

అందరికీ న్యాయం చేయాలె 

‘‘13 జిల్లాల్లో ఇప్పటికిప్పుడు 80% స్పౌజ్ బదిలీలు చేపట్టడానికి అవకాశం ఉంది. అయినా కేవలం 30 శాతం బదిలీలు చేపట్టాలని విద్యాశాఖ రెడీ కావడం సరికాదు. అవి కూడా స్కూల్​ అసిస్టెంట్లలో కొద్దిమందికి చేస్తామంటున్నారు. ఎక్కువ ఖాళీలున్న ఎస్జీటీ పోస్టులను డైరెక్ట్​ రిక్రూట్మెంట్ అనే సాకు చూపించి.. పూర్తిగా బ్లాక్​లో ఉంచడం సరికాదు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాలి.’’
- నరేష్,  స్పౌజ్ ఫోరం కో-కన్వీనర్