
- ఖాళీ అవుతున్న ప్రభుత్వ ఆఫీసులు
- నెలకు 500 మందికి పైగా పదవీ విరమణ
- ఉన్న వారిపై పెరుగుతున్న పని భారం
- రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంచుతామన్న సీఎం కేసీఆర్
- హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు ఉద్యోగుల సంఖ్య నెలనెలా తగ్గిపోతోంది. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, అధికారులు ప్రతి నెలా 500 మందికిపైగా రిటైరవుతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ల నాటి నుంచి ఇప్పటివరకు సుమారు ఆరు వేల మంది వరకు పదవీ విరమణ చేసినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. కొత్త ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో ఉన్న ఉద్యోగులపై భారం పెరుగుతోంది. గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దానిని వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఖాళీ పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నారు.
కాంట్రాక్టు నియామకాలూ లేవు
రెగ్యులర్ ఉద్యోగులను నియమించేందుకు ప్రభుత్వం కొన్ని నోటిఫికేషన్లు జారీ చేసినా.. పరీక్షలు, ఇతర అంశాల్లో తప్పులపై కోర్టు కేసులు నమోదై, భర్తీ ప్రక్రియలు ఆగిపోయాయి. హైకోర్టు అడిగిన సందేహాలు తీర్చటం, ప్రభుత్వ వాదనను కౌంటర్ రూపంలో దాఖలు చేయటంలోనూ నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియ కూడా దాదాపు ఆగిపోయింది. ఇప్పటికే ఈ విధానాల్లో కొనసాగుతున్న వారికి గడువును పెంచడం తప్ప, కొత్త వారిని తీసుకోవటం లేదు. ఇక రెండేళ్ల కింద చేపట్టాల్సిన టీఆర్టీ నియామకాలు రెండు నెలల కింద ప్రారంభమయ్యాయి. అదికూడా మొత్తం 8 వేల పోస్టులకుగాను ఇప్పటివరకు రెండు వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. మిగతా వాటి భర్తీకి కోర్టు కేసులు అడ్డంకిగా ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి.
టెక్నికల్ పోస్టుల పదవీకాలం పొడిగింపు
కొత్త రిక్రూట్ మెంట్లు లేకపోవటం వల్ల రిటైరైన కొందరు అధికారులనే తిరిగి కొనసాగిస్తూ వారి సేవలను వినియోగించుకుంటోంది. రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచీ ఇది జరుగుతోంది. ముఖ్యంగా నీటి పారుదల శాఖ, విద్యుత్ , రోడ్లు భవనాల శాఖలో టెక్నికల్ అంశాలపై అనుభవం ఉన్న అధికారుల సర్వీసును పొడిగిస్తున్నారు. వారికి రెగ్యులర్ ఉద్యోగులకిచ్చే వేతనాలు, ఇతర ప్రయోజనాల మాదిరి కాకుండా.. రిటైరయ్యే సమయంలో ఉన్న వేతనాలు కొనసాగేలా నియమిస్తున్నారు. అయితే దీనిపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలా నియమించడం వల్ల తమకు ప్రమోషన్లు రావటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిటైర్మెంట్ వయసు పెంపు డిమాండ్
ఉద్యోగుల అవస్థల నేపథ్యంలో రిటైర్మెంట్ వయసు పెంపు డిమాండ్ తెరపైకొచ్చింది. సీఎం తమ హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. రిటైర్మెంట్ వయసు పెంచితే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందన్న అభిప్రాయం సరికాదని.. ప్రభుత్వానికి ప్రయోజనం కూడా ఉందని అంటున్నారు.
ఉద్యోగాల భర్తీ విధానం మార్చాలి
రాష్ట్రంలో రెండున్నర లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వం నిధులు మిగుల్చుకుంటోంది. తొమ్మిదేళ్ల నుంచి గ్రూప్–1 పోస్టులు భర్తీ చేయలేదు. గ్రూప్–2, 3, 4 పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. కొత్త జిల్లాలతో 40 వేల పోస్టులు కావాలి. ఉద్యోగుల్లేక ఆఫీసులు వెలవెలబోతున్నాయి.
– ఆర్.కృష్ణయ్య,
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు