ప్రైవేట్ వర్సిటీల గుట్టు విప్పేందుకు సర్కార్ తనిఖీలు.. రంగంలోకి దిగిన హైలెవెల్ కమిటీ.. నిధుల మళ్లింపుపై స్పెషల్ ఆడిట్..

ప్రైవేట్ వర్సిటీల గుట్టు విప్పేందుకు సర్కార్ తనిఖీలు.. రంగంలోకి దిగిన హైలెవెల్ కమిటీ.. నిధుల మళ్లింపుపై స్పెషల్ ఆడిట్..
  • విద్య పేరుతో దోపిడీకి చెక్​పెట్టేలా సుప్రీంకోర్డు కొరడా  
  • 9 కీలక అంశాలపై రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్రానికి ఆదేశం
  • సిబ్బంది అర్హతల నుంచి వసతుల వరకు ఆరా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీల అక్రమాలపై సర్కారు విచారణ చేపట్టింది. విద్యను సేవా దృక్పథంతో అందిస్తున్నాయా లేక వ్యాపారంగా మార్చుకున్నాయా అన్న కోణంలో సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అవ్వడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి ప్రైవేట్ వర్సిటీలో తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తనిఖీలతో వర్సిటీల అసలు లక్ష్యం, అక్కడ అందుతున్న విద్యా ప్రమాణాల నాణ్యతను నిగ్గుతేల్చనున్నారు. దీనికి అనుగుణంగా వర్సిటీల్లో అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. 

స్టేట్​లో 20 వరకూ ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలు ఉన్నాయి. వీటికి పర్మిషన్ ఇచ్చేంత వరకే సర్కారు పని.. ఆ తర్వాత అటువైపు చూసే నాథుడే కరువయ్యారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాలేజీయేట్ ఎడ్యుకేషన్ చైర్మన్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి తనిఖీ కమిటీని నియమించింది. ఈ కమిటీలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ, జేఎన్టీయూ రిజిస్ట్రార్, ఓయూ ఫైనాన్స్ ఆఫీసర్‌‌‌‌తో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ నిపుణులను సభ్యులుగా చేర్చింది.

ఈ బృందం ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీలను సందర్శిస్తూ అక్కడి రికార్డులను వెరిఫై చేస్తోంది. కేవలం కాగితాల మీద విద్యాసంస్థలను చూపిస్తున్నారా లేక క్షేత్రస్థాయిలో వసతులు ఉన్నాయా అన్నది పరిశీలిస్తోంది. ప్రైవేటు వర్సిటీలతో పాటు ఫిర్యాదులున్న సుమారు 20 ప్రైవేటు కాలేజీల్లోనూ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు చెప్తున్నారు.

ఆ 9 అంశాలపైనే సుప్రీం ఫోకస్..

ప్రధానంగా తొమ్మిది కీలక అంశాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వర్సిటీ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి?.. ప్రభుత్వ భూములు ఏమైనా కేటాయించారా?.. అడ్మిషన్ల ప్రక్రియ చట్టబద్ధంగా ఉందా?.. వంటి అంశాలపై ఆరా తీస్తోంది. ముఖ్యంగా బోధనా సిబ్బంది నియామకంలో యూజీసీ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది ప్రధానంగా తనిఖీ చేస్తున్నారు. వీటితో పాటు స్టూడెంట్స్, స్టాఫ్ ఫిర్యాదుల పరిష్కారానికి సరైన వ్యవస్థ ఉందో లేదో కూడా కమిటీ పరిశీలిస్తోంది.

నిధుల మళ్లింపుపై ఆడిట్

లాభాపేక్ష లేని సంస్థలుగా రిజిస్టర్ అయి.. కోట్లాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్న వర్సిటీలు, ఆ నిధులను ఎక్కడికి మళ్లిస్తున్నాయనే దానిపై ప్రభుత్వం నిశితంగా ఆడిట్ నిర్వహిస్తోంది. యజమానులు లేదా వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఆస్తుల కొనుగోలుకు వర్సిటీ నిధులను వాడుతున్నారా అన్న కోణంలో నివేదిక సిద్ధం చేస్తున్నారు. 

ఈ తనిఖీల ఆధారంగా రూపొందించిన సమగ్ర అఫిడవిట్‌‌‌‌ను ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఆ తర్వాతే కోర్టు ఇచ్చే తీర్పును బట్టి నిబంధనలు ఉల్లంఘించిన వర్సిటీలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.