ఎస్సీఈఆర్టీ ప్రక్షాళనపై సర్కార్ ఫోకస్.. పోస్టులన్నీ భర్తీ చేసే చాన్స్​

ఎస్సీఈఆర్టీ ప్రక్షాళనపై సర్కార్ ఫోకస్.. పోస్టులన్నీ భర్తీ చేసే చాన్స్​
  • త్వరలోనే అక్రమ డిప్యూటేషన్లన్నీ రద్దు! 

  • వారంలో కొత్త నోటిఫికేషన్ 

  • సీనియార్టీకి ప్రియార్టీ ఇవ్వాలని అధికారుల నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) ప్రక్షాళనపై సర్కార్ ఫోకస్ పెట్టింది. త్వరలోనే ఈ సంస్థలో ఉన్న అక్రమ డిప్యూటేషన్లు, ఓడీలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఆ వెంటనే పైరవీలకు తావు లేకుండా కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి, ఆయా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తును విద్యాశాఖ ప్రారంభించింది. గత సర్కారు హయాంలో స్కూల్ ఎడ్యుకేషన్​లో కీలకమైన ఎస్సీఈఆర్టీ విభాగం ఆగమైంది.

నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్లు, రాత పరీక్షలు లేకుండానే ఏండ్ల నుంచి ఫారిన్ సర్వీస్, వర్క్ డిప్యూటేషన్, ఓరల్ డిప్యూటేషన్ పేరుతో టీచర్లు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వంలోని కొందరు మంత్రుల ఫైరవీలతో చివరికి ఎస్​జీటీ స్థాయి టీచర్లకూ దాంట్లో అవకాశం కల్పించారు. స్టూడెంట్లకు మంచి కరికులమ్ తయారీతో పాటు టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన ఎస్సీఈఆర్టీ పూర్తిగా పైరవీ కారులతో నిండిపోయింది. దీంతో పుస్తకాల్లో, కరికులమ్ రూపకల్పనలో అనేక తప్పిదాలు జరిగాయి. అయినా, వారిపై అప్పటి బీఆర్​ఎస్ సర్కార్​​ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొందరి కోసం కొత్తగా ఎస్సీఈఆర్టీలో ప్రత్యేక విభాగాలు కూడా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. 

డేటా సేకరించిన సెక్రటరీ..

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇటీవల ఎస్సీఈఆర్టీపై అధికారులతో సమీక్షించారు. ఎన్నేండ్ల నుంచి పనిచేస్తున్నారు? ఏ విభాగాల్లో పనిచేస్తున్నారనే వివరాలు వారి నుంచే అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఏండ్ల నుంచి పనిచేస్తున్నా.. రెండు, మూడేండ్ల నుంచే ఉంటున్నామని సెక్రటరీకే తప్పుడు సమాచారం ఇచ్చారు. పరిశోధనలు చేయాల్సిన ఎస్సీఈఆర్టీ అధికారులు.. పర్యవేక్షణలు చేయడంపైనా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ రకాల ఓడీల పేరుతో స్కూళ్లలో జీతాలు తీసుకుంటూ, ఇక్కడ పనిచేయడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. జాగ్రత్తగా పిల్లల కోసం పనిచేయాలని ఆదేశించారు. 

వారంలో నోటిఫికేషన్..! 

పైరవీలతో ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న టీచర్లను త్వరలోనే తొలగించేందుకు సర్కారు రెడీ అయింది. అందులోని ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా పారదర్శకంగా భర్తీ చేయనున్నది. వారం రోజుల్లో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న సబ్జెక్టులకు అర్హులైన టీచర్ల నుంచి దరఖాస్తులు తీసుకుని, సీనియార్టీతో పాటు వారి యాక్టివిటీ ఆధారంగా ఆయా ఖాళీలను భర్తీ చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. కేవలం రెండేండ్ల కాలానికి మాత్రమే డిప్యూటేషన్, ఫారెన్ సర్వీస్ లో తీసుకోవాలని భావిస్తున్నారు. తద్వారా స్టూడెంట్లకు మంచి కరికులమ్ అందించేందుకు సమాయత్తం అవుతున్నారు.