రియల్ ఎస్టేట్ వెంచర్లకు సర్కార్ పైసలు

రియల్ ఎస్టేట్ వెంచర్లకు సర్కార్ పైసలు

మంచిర్యాల జిల్లాలో లీడర్ల నిర్వాకం  కలెక్టర్ల ఆర్డర్స్​తో పనులకు బ్రేక్

గతంలో ఏసీడీపీ ఫండ్స్​తో లీడర్ల పొలాలకు గ్రావెల్​ రోడ్డు

మంచిర్యాల, వెలుగు: ఓవైపు రూరల్​ ఏరియాలకు సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లు… మరోవైపు రియల్​ ఎస్టేట్​ వెంచర్లకు అనుకూలంగా రోడ్లు వేయడం వివాదాస్పదంగా మారింది. తమ పవర్​ను అడ్డం పెట్టుకొని సర్కారు సొమ్మును మిస్​యూజ్​ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెల్లంపల్లి మండలం కన్నాల పంచాయతీ పరిధిలో నేషనల్​ హైవే 363ని ఆనుకొని ఒక వెంచర్​, కన్నాల ఎస్సీ కాలనీ దగ్గర్లో మరో వెంచర్​ ఏర్పాటు చేశారు. డిస్ర్టిక్ట్​ టౌన్​ అండ్​ కంట్రీ ప్లానింగ్​ (డీటీసీపీ) రూల్స్​ మేరకు వెంచర్లకు 33 ఫీట్ల వెడల్పుతో రోడ్లు నిర్మించాలి. దీంతో లీడర్లు, రియల్టర్లు కలిసి సర్కారు గ్రాంట్​తో రోడ్లు వేసేందుకు ప్లాన్​ చేశారు. కన్నాల ఎస్సీ కాలనీకి రోడ్డు పేరిట నిరుడు పంచాయతీలో తీర్మానం చేయించి డిస్ర్టిక్ట్​ మినరల్​ ఫండ్​ ట్రస్ట్​ (డీఎంఎఫ్​టీ)కి ప్రపోజల్స్​ పంపారు. ఆ రోడ్ల నిర్మాణంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి శాంక్షన్​ చేయాల్సి ఉన్నప్పటికీ ఆఫీసర్లు అవేమీ పట్టించుకోలేదు. గ్రామాల్లో పది పదిహేను ఫీట్లకు మించి రోడ్లు లేవు. ఎస్సీ కాలనీ పేరిట మాత్రం 33 ఫీట్ల రోడ్లు సాంక్షన్ చేయడం విచిత్రం.

బిట్లుగా చేసి నామినేషన్​పై అప్పగింత…

రెండు వెంచర్లకు డీఎంఎఫ్​టీ గ్రాంట్​ రూ.49 లక్షలతో సీసీ, మెటల్​ రోడ్లు శాంక్షన్​ చేశారు. అంచనా విలువ రూ.5లక్షలు దాటితే టెండర్లు పిలవాల్సి ఉంటుంది. దీంతో రూ.5లక్షల లోపు బిట్లుగా విభజించి నామినేషన్​పై కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇటీవలే వెంచర్లలో రోడ్డు మెటల్​ పోసి వర్క్​ స్టార్ట్​ చేశారు. అసలు విషయం లీక్​ కావడంతో కలెక్టర్​ భారతి హోళికేరి పనులు నిలిపివేసి, ఎంక్వైరీకి  డిస్ర్టిక్ట్​ చీఫ్​ ప్లానింగ్​ ఆఫీసర్​ (డీసీపీవో)కు ఆర్డర్స్​ జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీవో, పంచాయతీరాజ్​ ఏఈ సైట్​ మీదికి వెళ్లి పరిశీలించి ఎస్సీ కాలనీ కోసమే రోడ్డు వేస్తున్నట్టు రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై హయ్యర్​ ఆఫీసర్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ డీటెయిల్డ్​ రిపోర్టు అందించాలని ఆదేశించినట్టు సమాచారం. అలాగే ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు వర్క్ ఆపాలని కలెక్టర్​ ఆదేశించినప్పటికీ బేఖాతరు చేశారు. రాత్రికిరాత్రే మెటల్​ లెవలింగ్​ చేయడంపై కలెక్టర్​కు కంప్లైంట్​ వెళ్లడంతో ఆగిపోయారు.  మైనింగ్​ డిపార్ట్​మెంట్​ పర్మిషన్​ లేకుండానే రోడ్లకు మొరం తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ప్రజాప్రతినిధికి గిఫ్ట్​గా​ ప్లాట్లు…

డీఎంఎఫ్​టీ ఫండ్స్​తో రియల్​ ​వెంచర్లకు రోడ్లు వేసేందుకు సాయం చేసిన రియల్టర్లు ఒక ప్రజా ప్రతినిధికి గిఫ్ట్​గా ప్లాట్లు ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైవే పక్కన ఉన్న వెంచర్​లో నిర్మిస్తున్న ట్రిపుల్​ ఫ్లోర్​ బిల్డింగ్​ ఆయనదే అని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. నామినేషన్​పై వర్క్స్​ ఇచ్చినందుకు కాంట్రాక్టర్లు రూ.70వేల దాకా ముట్టజెప్పినట్టు తెలిసింది.
గతంలో లీడర్ల భూములకు…

లీడర్లు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం ఇదే మొదటిసారి కాదు. మూడేళ్ల కిందట నెన్నెల మండల కేంద్రం శివారులోని గ్రావెల్​ రోడ్డు పనిలో లీడర్ల కోసం రూ.13 లక్షల ఏసీడీపీ ఫండ్స్​ను దుర్వినియోగం చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది.