- ఫేజ్-2 టీచర్లకూ ఫేజ్-1తో సమానంగా బెనిఫిట్స్
- ఏప్రిల్ 2025 నుంచి పెరిగిన జీతాలు
- ఉత్తర్వులు జారీచేసిన విద్యా శాఖ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్లకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నవారి సీనియారిటీ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం చూపింది. ఫేజ్-2లో నియమితులైన టీచర్లకు కూడా.. ఫేజ్-1 టీచర్లతో సమానంగా 2013 నుంచే సీనియారిటీ వర్తింపజేస్తూ విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది.
హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ మంగళవారం మెమో నెం.4953 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వందలాది మంది పీజీటీ, టీజీటీ టీచర్లకు ఊరట లభించినట్లయింది. రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్‌లో 2013 జూన్‌లో ఫేజ్-1 టీచర్లు జాయిన్ కాగా, 2014 సెప్టెంబరులో ఫేజ్-2 టీచర్లు (పీజీటీలు, టీజీటీలు) విధుల్లో చేరారు.
అయితే తమను కూడా ఫేజ్-1 టీచర్లతో సమానంగా గుర్తించి, 2013 నుంచే సీనియారిటీ ఇవ్వాలని 127 మంది టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఫేజ్ 2లో జాయిన్ అయిన టీచర్లకు కూడా సర్వీస్ పరంగా ఫేజ్-1 టీచర్లతో వీరు సమానమవుతారు.
అయితే, సీనియారిటీని 2013 నుంచి లెక్కించినా.. పెరిగిన జీతాలు మాత్రం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి, కొందరికి జులై 1 నుంచి అందనున్నాయి. ఇక సీనియారిటీ సమానం కావడంతో ప్రమోషన్లలో అందరూ సమానంగా మారిపోయారు. సర్కారు ఇచ్చిన ఈ ఉత్తర్వులతో పీజీటీలు 768 మంది, టీజీటీలు 558 మందికి లబ్ధి చేకూరనున్నది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం నోషనల్ సర్వీస్ అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై టీఎంఎస్టీఏ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి వారు ధన్యవాదాలు చెప్పారు.
