రవాణా శాఖలో పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్!

రవాణా శాఖలో పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
  • అడిషనల్ కమిషనర్ పోస్టు భర్తీకి తొలగిన న్యాయపరమైన చిక్కులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రవాణా శాఖలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న పదొన్నతులు, ఖాళీల భర్తీపై ప్రభుత్వం ఫోకస్​పెట్టింది. ట్రాన్స్​పోర్టు ఉన్నతాధికారులు పంపిన ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించింది.  గత కొన్నేళ్లుగా పదొన్నతుల కోసం ఎదురుచూస్తున్న సుమారు 15 మంది మోటార్ వెహికల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లకు (ఎంవీఐ) ఆర్టీఓలుగా ప్రమోషన్ లభించనుంది.

వీరికి ప్రమోషన్లు వస్తే తాము ఎంవీఐలుగా పదొన్నతి పొందవచ్చని ఏఎంవీఐలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో ఇప్పటివరకు 'అడిషనల్ కమిషనర్' పోస్టును ఏర్పాటు చేయలేదు. కమిషనర్ తర్వాత అత్యంత కీలకమైన అడిషనల్ కమిషనర్ పోస్టు భర్తీకి న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 ప్రస్తుతం రాష్ట్ర రవాణా శాఖలో  ముగ్గురు జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్లు ఉన్నారు. ఇందులో ఇద్దరు ఈ మధ్యనే డీటీసీల నుంచి జేటీసీలుగా పదొన్నతి పొందారు. అంతకు ముందు జేటీసీగా రమేశ్ ఒక్కరే కొనసాగగా మళ్లీ ఆయనకే  అడిషనల్ కమిషనర్ పోస్టు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 10 ఆర్టీఓ పోస్టులు, 15 ఎంవీఐ, 10 ఏఎంవీఐ పోస్టులు ఖాళీ ఉన్నాయి.

అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సుమారు 15  సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న కీలక పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో రవాణా శాఖ అధికారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో అడ్మినిస్ట్రేషన్ మరింత వేగవంతం కావడమే కాకుండా, ప్రజలకు రవాణా సేవలు మరింత చేరువయ్యే అవకాశం ఉంది.