కరోనా కట్టడికి సర్కార్ గైడ్​లైన్స్​

కరోనా కట్టడికి సర్కార్ గైడ్​లైన్స్​
  • టెస్టింగ్‌.. ట్రేసింగ్‌.. ట్రీటింగ్‌ అమలు చేయాలి
  • అధికారులకు మంత్రి ఈటల ఆదేశం
  • హాస్పిటళ్లలో ఇన్​ పేషెంట్లు, లక్షణాలతో వచ్చే పేషెంట్లకు ఆర్టీపీసీఆర్‌‌  తప్పనిసరి
  • దవాఖాన్లకు హెల్త్​ డిపార్ట్​మెంట్​ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి పెరుగుతుండటంతో రాష్ట్ర సర్కారులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. అన్ని హాస్పిటళ్లలో ఇన్​ పేషెంట్లకు, కరోనా లక్షణాలతో వచ్చే ఔట్​ పేషెంట్లకు, లక్షణాలు లేకున్నా వచ్చే  హై రిస్క్​ పేషెంట్లకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలంటూ గైడ్​లైన్స్​ జారీ చేసింది. ‘సెకండ్‌ వేవ్‌ కట్టడికి ప్లాన్‌ ఏది?’ శీర్షికన బుధవారం ‘వెలుగు’ ప్రచురించిన స్టోరీపై ప్రభుత్వం స్పందించింది. హెల్త్​ మినిస్టర్​ ఈటల రాజేందర్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కరోనా సెకండ్‌ వేవ్‌పై కీలక ఆదేశాలు జారీ చేశారు. టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. దీంతో హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌  గైడ్​లైన్స్​ విడుదల చేసింది. 
 

టెస్టింగ్‌.. ట్రేసింగ్‌.. ట్రీటింగ్‌ 
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుడంటంతో టెస్టింగ్‌.. ట్రేసింగ్‌.. ట్రీటింగ్‌ పద్ధతిని కచ్చితంగా అమలు చేయాలని హెల్త్​ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లను మంత్రి ఈటల రాజేందర్‌  ఆదేశించారు. బుధవారం ఆఫీసర్లతో ఆయన  ఫోన్‌లో మాట్లాడారు. కరోనా టెస్టుల సంఖ్య మరింత పెంచాలన్నారు. వైరస్‌ ఉధృతిపై చర్చించేందుకు గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా ట్రీట్​మెంట్​  అందిస్తున్న హాస్పిటళ్ల సూపరింటెండెంట్స్, నోడల్​ఆఫీసర్లను సమావేశంలో భాగస్వాములుగా చేయాలన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పని సరిగా పెట్టుకోవాలని, ఫిజికల్​ డిస్టెన్స్​  పాటించాలని, ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి రావొద్దన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా తీవ్రత తక్కువగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు. కేసులు పెరిగినా  సమర్థవంతంగా ట్రీట్​మెంట్​ అందించగలమన్నారు. వాక్సినేషన్  వేగంగా జరుగుతోందని చెప్పారు.  అందరికీ వాక్సిన్ అందించడానికి అవసరమైన డోసులు పంపించాలని ఇప్పటికే కేంద్ర మంత్రిని కోరినట్లు వివరించారు. కరోనా ప్రారంభ సమయంలోనూ సీఎం సహకారంతో విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో డెత్ రేట్​ను  గణనీయంగా తగ్గించగలిగామని మంత్రి అన్నారు.

ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయండి
రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్లలో  కోమార్బిడ్‌ పేషెంట్లు, గర్భిణులు తదితరులకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని రాష్ట్ర హెల్త్​ డిపార్ట్​మెంట్​  గైడ్​లైన్స్​  జారీ చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకు ఈ సూచనలు చేసింది. అన్ని హాస్పిటళ్లలో టెస్టులు నిర్వహించి, వాటి ఫలితాలను నిర్దేశిత ఫార్మాట్‌లో తమకు  పంపాలని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఆస్పత్రులకు ఔట్‌ పేషెంట్లుగా వచ్చినా, ఇన్‌ పేషెంట్లుగా జాయిన్‌ అయినా వారికి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలన్నారు. సర్ది, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారికి,  రుచి, వాసన కోల్పోయిన వారికి పరీక్షలు చేయాలని ఆదేశించారు. లక్షణాలు లేకున్నా హైరిస్క్‌లో ఉన్న పేషెంట్లకు టెస్టులు చేయాలని, ఆపరేషన్లు, ఇతర వైద్య సహాయం కోసం హాస్పిటళ్లలో చేరిన వారికి వారం రోజులకు ఒకసారి పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రసవం కోసం హాస్పిటళ్లలో చేరిన గర్భిణులకు కూడా టెస్టులు చేయాలని ఆయన ఆదేశించారు.