
- సప్లయర్లే టార్గెట్‌గా డేటాబేస్ రూపొందిస్తున్న టీమ్
- గంజాయి, డ్రగ్స్ మూలాలను గుర్తించి పట్టేస్తుంది
- ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని సమూలంగా అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈగల్’ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) మరింత బలోపేతం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సప్లయ్ సహా పబ్బులు, పట్టణాల్లో సింథటిక్ డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ఈగల్ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పోలీసుల మేధోశక్తితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కూడా వినియోగించనుంది. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలను ఈగల్ ఉన్నతాధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. డ్రగ్స్, గంజాయి సప్లయర్లు, కస్టమర్లపై డేగ కన్నులాగా నిఘా వేసేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు.
తెలంగాణ యాంటీ- నార్కోటిక్స్ బ్యూరో స్థానంలో ఈగల్ ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఈగల్ టీమ్ స్పెషల్ ఆపరేషన్లకు సిద్ధం అవుతోంది. కస్టమర్లు, సప్లయర్లే కాదు.. డ్రగ్స్, గంజాయి మూలాలను పెకిలివేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఈగల్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోగా ఉత్తమ ఫలితాలను సాధించిన క్రమంలోనే డ్రగ్స్‌పై ఈగల్ ఉక్కుపాదం మోపనుంది.
ఈ మేరకు డైరెక్టర్ సందీప్ శాండిల్యా ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్లకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి కేసుల్లో పట్టుబడిన పాత నేరస్తులు, కస్టమర్ల డేటా ఆధారంగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. దీంతో ఆయా డ్రగ్స్ సప్లయర్లకు చెందిన నెట్‌వర్క్‌ను ట్రేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, డార్క్‌వెబ్ సహా గోవా, బెంగళూరు, ముంబై లాంటి నగరాల నుంచి హైదరాబాద్‌కు సప్లయ్ అవుతున్న సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టింది.
పట్నం నుంచి పల్లె దాకా ‘ఈగల్’ ఆపరేషన్స్
డ్రగ్స్‌తో పోలిస్తే గంజాయికి డిమాండ్ పెరిగిపోతోందని ఈగల్ టీమ్స్ గుర్తించాయి. గతంలో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభ్యమయ్యే గంజాయి.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. దీంతో గంజాయి కట్టడిపై ఈగల్ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీ, ఒడిశా సహా ఏజెన్సీ ప్రాంతాల నుంచి రవాణా అవుతున్న గంజాయికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. గంజాయి, సింథటిక్ డ్రగ్స్ స్మగ్లర్లు, కొరియర్ల నుంచి స్వాధీనం చేసుకునే సెల్‌ఫోన్లు, ఇతర పరికరాలను డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా విశ్లేషించి ఆయా ముఠాలకు సంబంధించి స్మగ్లర్ల ప్రొఫైల్ తయారు చేయనుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డీఆర్‌ఐ లాంటి కేంద్ర సంస్థలు సహా ఏపీ, ఒడిశా, గోవా పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లు నిర్వహించనున్నారు.