ఇసుక తవ్వకాల కోసం మేడిగడ్డ ఖాళీ..10 రోజుల్లోనే 6 టీఎంసీల నీళ్లు వృథా

ఇసుక తవ్వకాల కోసం మేడిగడ్డ ఖాళీ..10 రోజుల్లోనే 6  టీఎంసీల నీళ్లు వృథా
  • కాంట్రాక్టర్ల లబ్ధి కోసం బ్యారేజీగేట్లు తెరిపించిన ప్రభుత్వం
  • పదిరోజుల్లోనే ఆరుటీఎంసీల నీళ్లు వృథా
  • ఫిబ్రవరిలోనే ఇసుకకాంట్రాక్ట్​ ముగిసినా
  • మరో ఆరునెలలు పొడిగింపు 12 రీచ్​ల ద్వారా ఇసుకను తోడి అమ్ముకుంటున్న కాంట్రాక్టర్లు
  • గోదావరిలోకి మట్టిరోడ్డు పోసి మరీ దర్జాగా తవ్వకాలు
  • గేట్ల దగ్గర తేలిన దిబ్బలు..వెలవెలబోతున్న రిజర్వాయర్​

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని ఇసుక తవ్వకాల కోసం రాష్ట్ర సర్కారు ఖాళీ చేయిస్తున్నది. ఇసుక కాంట్రాక్టర్ల ఒత్తిళ్లకు తలొగ్గి, గడిచిన పదిరోజుల్లో నాలుగు గేట్ల ద్వారా 6 టీఎంసీల నీటిని దిగువకు విడిచి పెట్టింది. దీంతో వాటర్​ స్టోరేజీ శనివారం నాటికి 0.6 టీఎంసీల కనిష్టస్థాయికి పడిపోయింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నడుమ ఇప్పటికే 12 ఇసుక రీచ్​లకు పర్మిషన్లు పొందిన కాంట్రాక్టర్లు.. నీటి మట్టం తగ్గడంతో వెంటనే రంగంలోకి దిగారు. వందల కోట్ల విలువైన ఇసుకను ఎక్స్​కవేటర్ల సాయంతో రేయింబవళ్లు గోదావరి నుంచి రెండు వైపులా ఎత్తిపోసుకుంటున్నారు.ఈ డంపుల నుంచి ఆరు నెలల పాటు ఇసుకను హైదరాబాద్​ సహా వివిధ ప్రాంతాలకు సరఫరా చేసి కోట్లకు కోట్లు దండుకోనున్నారు. 

స్టాక్‌‌‌‌ పాయింట్ల వద్ద ఇసుక నిల్వలు తగ్గినయనీ..!

నిరుడు తీవ్ర వరదల కారణంగా అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల మధ్య ఉన్న 12 ఇసుక క్వారీల్లోని స్టాక్‌‌‌‌ పాయింట్ల వద్ద  ఇసుక నిల్వలు తగ్గిపోయాయి. ప్రధానంగా సన్న ఇసుక దొరకట్లేదు. ఈ ఇసుక అమ్మితేనే కాంట్రాక్టర్లకు భారీగా లాభాలొస్తాయి. కానీ, గోదావరి నుంచి ఇసుక తోడి ఒడ్డున పోసేందుకు మేడిగడ్డ బ్యారేజీలో ఉన్న నీళ్లు వీళ్లకు సమస్యగా మారింది. ఆగస్టు నెలాఖరుతో కాంట్రాక్ట్‌‌‌‌ గడువు ముగుస్తుంది. వచ్చేది వర్షాకాలం కావడంతో జూన్​ రెండోవారం నుంచి మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూసే అవకాశముంది. అదే జరిగితే ఈ ఏడాది ఇక గోదావరి నుంచి ఇసుక తీయడం సాధ్యమయ్యేపని కాదు. దీంతో ఈ నెల రోజుల్లో సాధ్యమైనంత మేర గోదావరి లోంచి ఇసుకను తవ్వి పోసుకునేందుకు కాంట్రాక్టర్లంతా ఏకమయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ గేట్లను తెరిచేలా ప్రభుత్వ పెద్దలను ఒప్పించారు. ఈ క్రమంలో ఓ మంత్రి ఆదేశాలతో పది రోజుల కింద మేడిగడ్డ బ్యారేజీ గేట్లను నీటిపారుదల శాఖ ఆఫీసర్లు తెరిచారు. 6 టీఎంసీల నీటిని వృథాగా కిందికి వదలడంతో ప్రస్తుతం గోదావరి నది పొడవునా ఇసుక నిల్వలు తేలాయి. దీంతో కుంట్లం దగ్గర ఇసుక క్వారీ కాంట్రాక్టర్‌‌‌‌ నేరుగా గోదావరిలోనే మట్టి రోడ్డు పోసి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఇతర కాంట్రాక్టర్లు కూడా ఇదేరీతిన ఇసుక తవ్వకాలు జరపడానికి  ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నెల రోజుల్లో 12 ఇసుక క్వారీల నుంచి సుమారు 30 లక్షల క్యూబిక్‌‌‌‌ మీటర్లకు పైగా ఇసుకను తోడి ఒడ్డుకు పోయాలని ఇసుక కాంట్రాక్టర్లు భావిస్తున్నారు. ఇవే కాకుండా గతంలో నడిచి మూతపడ్డ తొమ్మిది ఇసుక క్వారీలను నిర్వహించడానికి అవసరమైన పర్మిషన్లు తెచ్చుకునేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. 

లీడర్లు, ఆఫీసర్ల అండతో దందా

భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీ దిగువన, మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన మొత్తం 21 ఇసుక క్వారీలుండగా ప్రస్తుతం 12 ఇసుక క్వారీలను టీఎస్​ఎండీసీ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఇందులో మహదేవ్‌‌‌‌ పూర్‌‌‌‌ మండలంలోని కుంట్లం వద్ద 3, పలుగుల వద్ద 4, పూసుకుపల్లి వద్ద 3, మద్దలపల్లి, గుండ్రాత్‌‌‌‌పల్లి దగ్గర ఇసుక క్వారీలు నడుస్తున్నాయి. ఈ రీచ్​లలో ఇసుక తవ్వకాలకు మూడేండ్ల కింద పర్మిషన్‌‌‌‌ ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరితో వీటి గడువు ముగియనుండగా.. కాంట్రాక్టర్ల ఒత్తిడితో టీఎస్‌‌‌‌ఎండీసీ ద్వారా మరో 6 నెలలు పాటు టైం పొడిగించారు. గోదావరి నుంచి ఇసుక తోడి ఒడ్డుకు పోసే పనిని ఆయా కాంట్రాక్టర్లదే. ఇందుకోసం క్యూబిక్​ మీటర్‌‌ ఇసుక‌‌కు రూ.110  చొప్పున ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నది. ఒడ్డుకు పోసిన ఇసుకను టీఎస్‌‌‌‌ ఎండీసీ క్యూబిక్​ మీటర్​కు రూ.600 చొప్పున ఆన్​లైన్​ ద్వారా బయట అమ్మాల్సి ఉంది. నిజానికి ఒడ్డుకు పోయడం వరకే కాంట్రాక్టర్ల బాధ్యత. కానీ లీడర్లు, ఆఫీసర్ల అండదండలతో ఈ  కాంట్రాక్టర్లే సొంతంగా టిప్పర్లను సమకూర్చుకొని బ్లాక్​ మార్కెటింగ్ చేస్తున్నారు. ఇసుకను బయట అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఇసుక కాంట్రాక్ట్‌‌లు‌‌ దక్కించుకున్నవాళ్లంతా స్థానికేతరులు, రాజకీయ పలుకుబడి కలవాళ్లే.