చౌమొహల్లా ప్యాలెస్లో అందాల భామలకు విందు.. హాజరైన సీఎం రేవంత్ దంపతులు

చౌమొహల్లా ప్యాలెస్లో అందాల భామలకు విందు.. హాజరైన సీఎం రేవంత్ దంపతులు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్-2025 కాంపిటిషన్ స్టార్ట్ కాగా.. మంగళవారం (మే 13) అందాల భామలకు హైదరాబాద్ ఐకానిక్ ప్లేస్ చౌమొహల్లా ప్యాలెస్‎లో విందును ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రపంచ సుందరీమణులు చౌమొహల్లా ప్యాలెస్ అందాలను తిలకించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, సినీ తారలు హాజరయ్యారు. హీరో నాగార్జున తదితర సినీ సెలబ్రెటీలు ఈ విందులో సందడి చేశారు. 

ఈ విందుకు ముందు.. ప్రపంచ సుందరీమణులు చార్మినార్ దగ్గర సందడి చేశారు. 109 దేశాల అందగత్తెలకు రెడ్ కార్పెట్‎తో.. సంప్రదాయ అరబ్బీ మర్ఫా సంగీతంతో స్వాగతం పలికారు. చార్మినార్ అందాలను, చుట్టుపక్కల ప్రాంతాలను తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు భామలు. ఆ తర్వాత చార్మినార్‌ దగ్గర ప్రత్యేక ఫొటో షూట్‌నిర్వహించారు. 

అనంతరం లాడ్ బజార్ లోని తొమ్మిది ప్రముఖ దుకాణాల్లో ఈ సుందరీమణులు షాపింగ్ చేశారు. గాజులు, ముత్యాల హారాలు, ఇంకా అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడమే కాక.. అక్కడే గాజులు తయారీ విధానాన్ని కూడా స్వయంగా సుందరీమణులు పరిశీలించారు. నాలుగు గ్రూపులుగా విడిపోయి ఒక్కో గ్రూప్ రెండు షాప్‎లలో షాపింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం చార్మినార్  నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. 

హెరిటేజ్ వాక్‎కు అంతరాయం కలుగకుండా ట్రాఫిక్ డైవర్షన్ విధించారు పోలీసులు. పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో  పాతబస్తీ వీధులన్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదీనా, చార్మినార్, శాలిబండ, వొల్గా జంక్షన్, ఖిల్వత్ రోడ్లను పూర్తిగా క్లోజ్ చేశారు. ఇవాళ రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.