- ఆ జిల్లాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన ఐదు సంస్థలు
- 7 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం
- రూ.45 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందాలు
హైదరాబాద్, వెలుగు: గ్రీన్ఎనర్జీ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో సోలార్, విండ్ వంటి గ్రీన్ఎనర్జీ ఉత్పత్తి పెద్దగా జరగడం లేదు. దీంతో రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్స్, సోలార్ ప్లాంట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్(బీఈఎస్‌ఎస్), ఈ–మిథనాల్ ప్లాంట్స్, 2జీ ఇథనాల్ ప్లాంట్స్, కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్, గ్రీన్ హైడ్రోజన్, మినరల్ ప్లాంట్స్ఏర్పాటుకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి.
ఇందులో ముఖ్యంగా పంప్డ్ స్టోరేజ్ప్లాంట్ల ఏర్పాటుకు ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉన్నట్లు కొన్ని ప్రైవేట్సంస్థలు గుర్తించాయి. ఇక్కడ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.45 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ఐదు సంస్థలు ముందుకొచ్చాయి. సుమారు 7,460 మెగావాట్ల గ్రీన్ఎనర్జీ తయారు చేస్తామని గ్లోబల్ సమిట్‌లో ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.
ప్లాంట్లు ఎక్కడెక్కడంటే?
పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటు విషయమై పలు ప్రైవేట్కంపెనీలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత సర్వే జరిపాయి. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలు అనుకూలంగా ఉన్నట్టు గుర్తించాయి. ఇక్కడ అడవులతో కూడిన ఎత్తైన పర్వత శ్రేణులు, వాటర్ రిసోర్సెస్, అనువైన భూములు ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఇక్కడ రూ.45,650 కోట్లతో ప్లాంట్స్ఏర్పాటు చేయడానికి ఐదు సంస్థలు ముందుకొచ్చాయి.
గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్(జీఈపీఎల్) రూ.24 వేల కోట్లతో ములుగు జిల్లా ఇప్పగూడెం దగ్గర 3,960 మెగావాట్లు, గ్రీన్‌కో టీజీ01 ఐఆర్‌ఈపీ ప్రైవేట్లిమిటెడ్రూ.5,800 కోట్లతో ఆదిలాబాద్జిల్లా జారీ గ్రామంలో 950 మెగావాట్లు, సిద్దార్థ్ ఇన్‌ఫ్రా టెక్ అండ్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్రూ.5,600 కోట్లతో ఆదిలాబాద్, నిర్మల్‌జిల్లా పరిధిలోని రణపూర్ గ్రామంలో 900 మెగావాట్లు, ఆస్థా గ్రీన్ఎనర్జీ వెంచర్స్ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.4,650 కోట్లతో నిజామాబాద్జిల్లా మైలారం గ్రామంలో 750 మెగావాట్లు, సెరల్యూన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్రూ.5,600 కోట్లతో ఆదిలాబాద్ జిల్లా రామపురలో 900 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చినట్టు విద్యుత్‌శాఖ ఆఫీసర్లు ప్రకటించారు. ఈ సంస్థలు గ్లోబల్సమిట్లో టీజీ రెడ్‌కో సంస్థతో ఒప్పందాలు చేసుకున్నాయి.
ఏంటీ పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు?
పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్లు ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేయడానికి, జనరేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి రెండు రిజర్వాయర్ల మధ్య నీటిని పంప్ చేసి, టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు రెండు రిజర్వాయర్లు అవసరం. వాటి మధ్య ఎత్తులో తేడా 100 మీటర్ల కంటే ఎక్కువ ఉండాలి. ఇలాంటివి కొండలు, పర్వత ప్రాంతాల్లో సులభంగా ఏర్పాటు చేయవచ్చు.
ఈ ప్లాంట్లు పని చేయాలంటే ముఖ్యంగా సరిపడా నీరు అందుబాటులో ఉండాలి. నదులు, సరస్సులతో పాటు రిజర్వాయర్ల దగ్గర ఏర్పాటు చేయవచ్చు. ప్రతిరోజు క్లోజ్డ్-లూప్ సిస్టమ్‌లో నీరు రీసైకిల్ అవుతుంది. ఒక గిగావాట్విద్యుదుత్పత్తికి 10 హెక్టార్లకు పైగా భూమి అవసరం.
ఒకసారి ప్లాంట్ ఏర్పాటు చేస్తే 50 నుంచి వందేండ్లకు పైగా సేవలందిస్తుంది. ‘‘పొద్దున తక్కువ ఖర్చుతో తయారైన సోలార్, విండ్పవర్ఆధారంగా కింద ఉన్న నీటిని ఎత్తు ఉన్న ప్రదేశానికి పంపింగ్చేసి.. పీక్ అవర్‌లో అంటే ఎక్కువ డిమాండ్ఉండే సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఎత్తున ఉన్న నీటిని కిందికి పంప్చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేయడాన్నే పంప్డ్ స్టోరేజీ ప్లాంట్సిస్టమ్ అంటారు. రెండు జలాశయాల మధ్య నీటిని పైకి, కిందికి పంపింగ్చేస్తూ విద్యుత్ తయారు చేసి స్టోర్ చేసే విధానం” అని ఇంజనీర్లు తెలిపారు.
నెట్ జీరో పాలసీలో భాగమే..
భూమి ఉష్ణోగ్రతలు పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. భవిష్యత్తులో భూమి ఉష్ణోగ్రతలు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యల కోసం నెట్‌జీరో పాలసీ తీసుకొచ్చారు. భూమి ఉష్ణోగ్రతను 1.5 సెంటిగ్రేడ్ లోపు పరిమితం చేయాలంటే 2050 నాటికి ప్రపంచం మొత్తం నెట్ జీరోకు చేరుకోవాలని ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. భారత్‌తో పాటు 140 దేశాలు నెట్‌జీరో లక్ష్యాలను ప్రకటించాయి.
ఇందులో భాగంగానే సోలార్, విండ్ వంటి రెన్యూవబుల్ ఎనర్జీ పెంచడం, ఎలక్ట్రిక్ వాహనాలు, పర్యావరణాన్ని కాపాడే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్, చెట్లు నాటడం, అడవుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కూడా ఈ నెట్‌జీరో పాలసీలో భాగంగానే గ్లోబల్సమిట్లో సుమారు రూ.3 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు. భవిష్యత్తులో గ్రీన్ఎనర్జీని పెంచడానికి ఇవి దోహదపడతాయి.

