ప్రభుత్వం అప్పర్ మానేర్ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోంది

ప్రభుత్వం అప్పర్ మానేర్ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోంది

మంత్రి కేటీఆర్ ఎప్పుడు సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చిన ప్రతి పర్యటనలో కాంగ్రెస్ నాయకులను అరెస్టులు  చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ . ప్రెస్ మీట్ లో మాట్లాడిన పొన్నం.. గండి పెల్లి, గౌరవెల్లి ప్రాజెక్టుల నిర్లక్ష్యం విషయంలో తాము చేసిన ఆందోళన కారణంగానే మంత్రి హరీష్ రావు,  ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ రావు ఆ ప్రాజెక్టులపై రివ్యూ మీటింగ్ పెట్టి ఐదు నెలల్లో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. స్వయానా సీఎం కేసీఆర్ కొడుకు, మంత్రి కేటీఆర్  ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని అప్పర్ మానేరు ను ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు చెబితే ఈరోజు ఎల్లారెడ్డిపేట వచ్చానన్నారు. మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ప్రాజెక్టు లకు నీరు ఎలా తరలిస్తున్నారు ? ఈ ప్రాజెక్టుల కన్నా ముందే ప్రతిపాదించబడిన అప్పర్ మానేరు కు ఎందుకు నీటిని తరలించడం లేదు? ఇది మీ అసమర్ధతనా ? లేక ఉద్దేశపూర్వకంగానే ఇక్కడి ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నారా అంటూ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నానన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పర్ మానేరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 6 ఏళ్లు గడిచినా కూడా  ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకపోతే బాధ్యత ఎవరిదన్నారు పొన్నం. ఈ విషయమై మంత్రి కేటీఆర్ గారు ఎదురుదాడి కాకుండా, అప్పర్ మానేరు ప్రాజెక్టు పర్యటనకు వచ్చి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యాచరణ రూపొందించి ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు.