ప్రైవేటు మెడికల్ కాలేజీలకు కేసీఆర్ కిట్సేంది?

ప్రైవేటు మెడికల్ కాలేజీలకు కేసీఆర్ కిట్సేంది?
  • మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడకూ ప్రగతి భవన్​వర్గాల క్లాస్
  • సొంత కాలేజీలను కాపాడుకునేందుకు ఎత్తులంటూ ఫైర్
  • ప్రైవేటు టీచింగ్ కాలేజీ యాజమాన్యాల మీటింగ్​పైనా ఆరా
  • వివరాలు సేకరించిన ప్రగతిభవన్ వర్గాలు!

హైదరాబాద్, వెలుగు:  గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మాదిరే ప్రైవేటు టీచింగ్ ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్స్ ఇవ్వాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలిసింది. ప్రైవేటు టీచింగ్ హాస్పిటల్స్ యాజమాన్యాల ప్రపోజల్​కు సానుకూలంగా ఉన్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్​పై గుస్సాగా ఉన్నట్టు సమాచారం. ఈటల ప్రతిపాదనకు వంతపాడిన మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డిలకు ప్రగతిభవన్ వర్గాలు క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది.

కేసీఆర్ కిట్స్ ను ప్రైవేటు టీచింగ్ ఆస్పత్రులకు ఇవ్వాలనే ప్రతిపాదనపై మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో జరిగిన సమావేశాన్ని ఎవరు నిర్వహించారు? స్వయంగా ఈటలనే ఆహ్వానించారా? లేక ప్రైవేటు టీచింగ్ ఆస్పత్రుల మేనేజ్​మెంట్లు నిర్వహించాయా? అనే కోణంలో ప్రగతిభవన్ వర్గాలు వివరాలు సేకరించినట్టు సమాచారం. ‘‘హెల్త్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి గవర్నమెంట్ దవాఖాన్ల కోసం ఆలోచించాలి. వాటి బాగు కోసం కృషి చేయాలి. కాని మంత్రి ప్రైవేటు వాళ్ల కోసం ఆలోచిస్తున్నారు. ప్రైవేటు టీచింగ్ హస్పిటల్స్​లో కేసీఆర్ కిట్స్ ఇస్తే సర్కారు దవాఖాన్లకు ప్రజలు వెళ్తారా’’ అని ఓ సీనియర్ అధికారి కామెంట్ చేశారు. ఈ విషయంలో మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్​లపైనా సీరియస్ అయిన ప్రగతి భవన్ వర్గాలు.. సొంత కాలేజీల ప్రయోజనాలే ముఖ్యమా అని ప్రశ్నించినట్లు సమాచారం.

సొంత ఎజెండాతో మంత్రులు?

సర్కారు దవాఖాన్లలో కేసీఆర్ కిట్స్ అమలు చేయడంతో ప్రైవేటు హాస్పిటల్స్​లో డెలివరీలు తగ్గిపోయాయి. ప్రైవేటు టీచింగ్ హస్పిటల్స్ లో డెలివరీలు చేయించుకునే వారు కరువయ్యారు. ఇది ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ఇబ్బందిగా మారింది. దీంతో చాలా కాలంగా యాజమాన్యాలు కేసీఆర్ కిట్ పథకాన్ని తమ ప్రైవేటు టీచింగ్ ఆస్పత్రుల్లో కూడా అమలు చేయాలని కోరుతున్నాయి. హైదరాబాద్ శివారులోని ఈటల సన్నిహితులకు చెందిన ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యం ఈ ప్రతిపాదనను మంత్రి ముందుంచిందని తెలిసింది. కేవలం ఒక కాలేజీ ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెడితే సరిపోదన్న కారణంతో.. అన్ని టీచింగ్ హాస్పిటిల్స్ ఏకతాటిపైకి వచ్చాయి. అందులో మంత్రులు పువ్వాడ అజయ్, మల్లారెడ్డిలకు చెందిన మెడికల్ టీచింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. మెడికల్ కాలేజీ నడుపుతున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కూడా జత కలుపుకున్నాయి. కొన్ని రోజుల కిందట ఈటల ఇంట్లో ప్రైవేటు టీచింగ్ హాస్పిటల్ మేనేజ్​మెంట్లు సమావేశం అయ్యాయి. ఈ మీటింగ్​కు మంత్రులు పువ్వాడ అజయ్, మల్లారెడ్డి, అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఇతర టీచింగ్ కాలేజీల యాజమానులు పాల్గొన్నారు. తర్వాత ప్రైవేటు టీచింగ్ ఆస్పత్రుల ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి ఈటల ప్రకటించారు.

30 డెలివరీలు జరగకున్నా.. 300 జరిగినట్టు..

కేసీఆర్ కిట్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వ దవాఖాన్లలో డెలివరీల సంఖ్య రెండింతలైంది. డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్లు మాత్రమే ప్రైవేటు దవాఖాన్లకు వెళ్తున్నారు. డెలివరీల కోసం ప్రైవేటు టీచింగ్ దవాఖాన్లకు వెళ్లే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కొన్ని హాస్పిటళ్లలోనైతే నెలకు 30 డెలివరీలు కూడా జరుగుతలేవు. అక్కడ చదివే వైద్య విద్యార్థులకు క్లినికల్ ప్రాక్టీస్ కరువైంది. దీంతో స్టూడెంట్స్.. కాలేజీల యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతివ్వాలని కోరుతున్నారు. మరోవైపు పేషెంట్లు రావడం లేదని ఎంసీఐకి తెలిస్తే సీట్లలో కోత విధించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పేషెంట్లు రాకున్నా వచ్చినట్టు, నెలకు 30 డెలివరీలు జరగకున్నా.. 300 జరిగినట్టు పత్రాలు చూపి కాలేజీలు మేనేజ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పేషెంట్లు రావడం లేదన్న కారణంతో స్టూడెంట్స్‌ను సర్కార్ దవాఖానకు పంపితే, అసలుగుట్టు బయట పడి సీట్లు కోల్పేయే ప్రమాదముందని ఆస్పత్రులు భయపడుతున్నాయనే వాదనలు ఉన్నాయి. కేసీఆర్ కిట్ అమలు చేస్తే డెలివరీల కోసం టీచింగ్ హాస్పిటళ్లకు పేషెంట్లు వస్తారని భావించి, ప్రభుత్వంపై ప్రైవేటు యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని చెబుతున్నారు.

ప్రసవాలు పెరిగినయ్.. డాక్టర్ల గైర్హాజరు తగ్గింది

ప్రభుత్వం కేసీఆర్ కిట్స్ పథకాన్ని 2017 జూన్ 2న ప్రారంభించింది. అమ్మాయి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే 12 వేలు ఈ పథకం కింద ఇస్తారు. తల్లీబిడ్డలకు ఉపయోగపడే రూ.2 వేల విలువైన 16 వస్తువులను ఇస్తారు. ఈ పథకంతో సర్కారు దవాఖాన్లలో ప్రసవాల సంఖ్య పెరిగిపోయింది. డాక్టర్ల గైర్హాజరు శాతం కూడా తగ్గింది. ‘‘2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపులో కేసీఆర్ కిట్ పథకం చాలా ఉపయోగపడింది. ఇప్పుడు ప్రైవేటు టీచింగ్ హాస్పిటల్స్​కు అనుమతి ఇస్తే భవిష్యత్ లో ప్రైవేటు దవాఖాన్లు కూడా ఒత్తిడి తెచ్చి ప్రమాదం ఉంది” అని ఓ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కిట్స్ ప్రైవేటు టీచింగ్ ఆస్పత్రుల్లో అమలు చేస్తే పథకం ఉద్దేశం నీరుగారిపోతుందని అధికారులు అంటున్నారు.