నిర్వాసితులకు ఆసరా..ఖమ్మం అభివృద్ధి పనుల్లో నష్టపోతున్న వారికి ఇండ్లు, జాగాలు 

నిర్వాసితులకు ఆసరా..ఖమ్మం అభివృద్ధి పనుల్లో నష్టపోతున్న వారికి ఇండ్లు, జాగాలు 
  • రోప్ వే వద్ద నష్టపోతున్నవారికి ఇంటి స్థలాలు
  • మార్కెట్ దగ్గర గుడిసెవాసులకు పట్టాలిచ్చేందుకు స్థల అన్వేషణ 
  • రోడ్డువెడల్పు బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో అభివృద్ధి పనుల్లో ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రోడ్ల వెడల్పు, ఇతర అభివృద్ధి పనుల్లో భాగంగా నష్టపోతున్న వారికి ఇంటి స్థలాలు, డబుల్ బెడ్రూమ్​ ఇండ్లు కేటాయిస్తోంది. ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకొని ఉంటున్న వారిని కూడా ఒప్పించి, వారికి ప్రత్యామ్నాయం చూపించి ఖాళీ చేయిస్తోంది. మూడ్రోజుల కిందట ఐదుగురికి ఇంటి స్థలాలివ్వగా, రోడ్ల వెడల్పులో ఇండ్లు కోల్పోతున్న 35 మంది డబుల్ బెడ్రూమ్​ ఇండ్లను అధికారులు కేటాయించారు. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్వాసితుల కోసం ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో ఇప్పటికే దాదాపు 125 ఎకరాల్లో డీటీసీపీ వెంచర్​ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం ఖిల్లా మీద రూ.29 కోట్లతో రోప్​ వే ఏర్పాటు చేస్తున్నారు.

ఖిల్లా సుందరీకరణ, గుట్టపై అమ్యూజ్ మెంట్ పార్కు, మినీ థియేటర్ నిర్మించాలని ప్లాన్​ చేశారు. రోప్​ వే నిర్మాణం కోసం అవసరమైన భారీ యంత్రాలను తరలించేందుకు రోడ్లు ఇరుకుగా ఉండడం, పర్యాటకులు వచ్చేందుకు అనుకూలంగా లేకపోవడంతో ఇక్కడ రోడ్డు వెడల్పు చేయాలని నిర్ణయించారు. రోప్ వే బేస్ స్టేషన్​ నిర్మాణం కోసం స్థానికులను ఒప్పించి స్థల సేకరణ చేస్తున్నారు. ఇక్కడ ఇండ్లు కోల్పోతున్న ఐదుగురికి రఘునాథపాలెం మండలంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ దగ్గర ఇంటి స్థలాలను కేటాయించారు.

కలెక్టర్​ అనుదీప్ దురిశెట్టి వారికి పట్టాలిచ్చారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రూ.156 కోట్లతో పూర్తిగా ఆధునీకరిస్తున్నారు. 15 ఎకరాల స్థలంలో పాత షెడ్లను తొలగించి, పూర్తిగా కొత్త మార్కెట్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు స్పీడగా జరుగుతుండగా, వచ్చే సంక్రాంతి నాటికి కొత్త మార్కెట్ ను అందుబాటులోకి తేనున్నారు. మార్కెట్ కు వెళ్లే రోడ్లను వెడల్పు చేయాలని నిర్ణయించారు. మార్కెట్ చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాల్లో పేదలు దాదాపు 350కిపైగా గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వారికి ఇంటిస్థలాలు ఇచ్చి ఖాళీ చేయించాలని నిర్ణయించారు.

ఒక్కొక్కరికి 72 గజాల చొప్పున స్థలాలు ఇచ్చేందుకు పదెకరాలకు పైగా భూమి అవసరమని అంచనా వేసిన రెవెన్యూ అధికారులు.. ప్రభుత్వ స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. రైల్వే స్టేషన్​దగ్గర రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న ఐదుగురికి అల్లీపురంలో డబుల్ బెడ్రూమ్​ ఇండ్లను కేటాయించారు. అల్లీపురం సింగిల్ రోడ్డువిస్తరణలో 30 మందికి పైగా నష్టపోతున్న పేదలకు కూడా అల్లీపురంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారు. 

అభివృద్ధిలో పేదలను భాగస్వాములను చేస్తున్నాం

ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పేదలను భాగస్వాములను చేస్తున్నాం. వారికి అన్యాయం జరగకుండా పునరావాసాన్ని కల్పిస్తున్నాం. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని ఉంటున్న వారిని బలవంతంగా ఖాళీ చేయించకుండా, వారిని ఒప్పించి మంచి ఏరియాలో స్థలాలు ఇస్తున్నాం. దీంతో పేదలు కూడా సంతోషంగా ఉంటున్నారు.– అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం కలెక్టర్​