సర్కారు జాబ్​ ఉన్నోళ్లు, ఊర్లో లేనోళ్లకు దళిత బంధా?

సర్కారు జాబ్​ ఉన్నోళ్లు, ఊర్లో లేనోళ్లకు దళిత బంధా?
  • సర్కారు జాబ్​ ఉన్నోళ్లు, ఊర్లె లేనోళ్లు అర్హులెట్లయితరు?
  • దళిత బంధు అర్హుల ఎంపిక తీరుపై దళితుల ఆగ్రహం
  • హుజూరాబాద్​ నియోజకవర్గంలో ఆందోళనలు, రాస్తారోకోలు
  • వీణవంక, జమ్మికుంట తహసీల్దార్​ ఆఫీసుల ముందు ధర్నాలు

కరీంనగర్, వెలుగు: దళిత బంధు అర్హుల ఎంపిక తీరుపై హుజూరాబాద్​ నియోజకవర్గంలో దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  అనర్హులను, పలుకుబడి ఉన్నోళ్లను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. పేదలను సెలెక్ట్​ చేయకుండా.. గవర్నమెంట్​ ఉద్యోగం ఉన్నోళ్లకు, ఊర్లె లేనోళ్లకు ప్రయారిటీ ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్​ హుజూరాబాద్​లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించనున్నందున ఆయన చేతుల మీదుగా 200 మందికి చెక్కులు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 200 మందిని  గ్రామానికి 20 మంది చొప్పున ఎంపిక చేయాల్సి ఉండగా.. ఇష్టమొచ్చినట్లు ఎంపిక చేశారని, పైరవీలు చేసినోళ్లకే  అవకాశం కల్పించారని శుక్రవారం దళితులు ఆందోళనకు దిగారు. తహసీల్దార్​ ఆఫీసుల ఎదుట నిరసన తెలిపారు. లిస్టుతో వచ్చిన ఆఫీసర్లను నిలదీశారు. 

సీఎంతో భోజనం చేసినోళ్లకూ చోటు లేదు
హుజూరాబాద్  మండలం కందుగుల గ్రామంలో అర్హుల లిస్టుతో గ్రామానికి వచ్చిన అధికారిపై అక్కడి దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో ఉన్న కాగితాలను లాగి పారేశారు. ఎనిమిది మందిని మాత్రమే ఎలా ఎంపిక  చేశారని  ప్రశ్నించారు. కేసీఆర్​తో సహపంక్తి భోజనానికి వెళ్లిన వారిలో ఇద్దరి పేర్లు కూడా లిస్టులో లేవని, లాబీయింగ్​ చేసినోళ్ల పేర్లు మాత్రం ఉన్నాయని వారు ఆరోపించారు. నిజమైన పేదోళ్లను విస్మరించి అనుకూలమైనవాళ్లను ఎంపిక చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్  జెడ్పీటీసీ బక్కారెడ్డి, ఆయన భార్య, సర్పంచ్​ ప్రభావతిని నిలదీశారు. పరకాల–-హుజూరాబాద్​ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అర్హుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆగ్రహం వక్తం చేస్తూ వీణవంక తహశీల్దార్ ఆఫీస్​ ఎదుట దళితులు ఆందోళన చేపట్టారు. అర్హుల జాబితాలో తమను ఎందుకు చేర్చలేదంటూ జమ్మికుంట తహసీల్దార్​ను  జమ్మికుంట దళితులు నిలదీశారు. ఇదే మండలం కుర్రపల్లిలో స్థానిక దళితులు గ్రామ పంచాయతీ ఆఫీసును ముట్టడించారు.   

పుకార్లు నమ్మొద్దు: కలెక్టర్​
ఇంతవరకు హుజూరాబాద్ నియోజకవర్గం లో ఏ ఒక్కరికి కూడా దళిత బంధు పథకం మంజూరు చేయలేదని,  ఎలాంటి  పుకార్లను నమ్మవద్దని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. ఈ నెల 16న హుజూరాబాద్ లో దళిత బంధు పథకాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారని, ప్రారంభించిన అనంతరం అర్హులందరికీ  పథకం మంజూరు చేస్తామని చెప్పారు. హుజూరాబాద్  నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో గల  గ్రామాల్లో ప్రత్యేక అధికారులు సర్వే చేసి, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ అర్హులను ఎంపిక చేస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.