నాడు యునెస్కో పోటీలో..  నేడు ముండ్ల పొదల్లో!

నాడు యునెస్కో పోటీలో..  నేడు ముండ్ల పొదల్లో!
  • వెయ్యి స్తంభాల గుడిపై సర్కారు నిర్లక్ష్యం
  • 15 ఏండ్లుగా నేల మీదే టెంపుల్ ​పిల్లర్లు
  • 2006 నుంచి పూర్తికాని కల్యాణ మండపం 

వరంగల్‍ రూరల్‍, వెలుగు: ములుగు జిల్లాలోని రామప్ప టెంపుల్‍ యునెస్కో గుర్తింపు పొందడంతో ఇప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ అప్పట్లో రామప్పతోపాటు వెయ్యి స్తంభాలగుడి, ఖిలా వరంగల్‍ను సైతం చేర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రై చేశాయి. 2014లో వరల్డ్​ హెరిటేజ్ ​సైట్స్​ టెంటేటివ్‍ జాబితాలో ఈ మూడింటికి చోటు దక్కింది. తీరా వెయ్యి స్తంభాల గుడి, వరంగల్​ ఫోర్ట్​ను ఆనుకుని ప్రైవేటు నిర్మాణాలు ఉండటంతో ఈ రెండూ రిజెక్ట్​ అయ్యాయి. నాడు, నేడు ఇక్కడి ఎమ్మెల్యేగా ఉన్న వినయ్‍భాస్కర్‍ ఆలయాన్ని సందర్శించి.. వెయ్యి స్తంభాల గుడి చుట్టూరా ఉండే ప్రైవేట్‍ నివాసాలను తొలగించి వారికి కావాల్సిన పరిహారం అందించనున్నట్లు చెప్పారు.  రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‍కుమార్‍, వరంగల్ ఎంపీ  పసునూరి దయాకర్, కేంద్ర పురావస్తుశాఖ రాష్ట్ర  సూపరింటెండెంట్ మిలాన్ కుమార్‍ను వెంట తీసుకొచ్చారు. ప్రాచీన కట్టడాల పరిరక్షణకు సీఎం కేసీఆర్ దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. శీతాకాల పార్లమెంట్​సమావేశాల్లోనే  కావాల్సిన నిధులు, పర్మిషన్లు  తీసుకొచ్చి ఏడాదిలోపు  కల్యాణ  మండపం పనులు పూర్తయ్యేలా చూస్తామని  హామీ ఇచ్చారు. మరో రెండేండ్లు గడిచాయి తప్పితే.. పద్మాక్షి టెంపుల్​ శ్మశానవాటిక పక్కనున్న పిల్లర్లను ముట్టుకున్నవారు లేరు. ప్రైవేటు నిర్మాణాలూ అలాగే ఉన్నాయి.

టూరిస్టులు ఫిదా అవ్వట్లే..
వెయ్యి స్తంభాల గుడి అనగానే.. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు ఎంతో ఊహించుకుని వస్తున్నారు. ఆలయ నిర్మాణం, శిల్ప సంపద ఎలా ఉంటుందో చూడాలని ఆరాటపడుతున్నారు. తీరా ఇక్కడి పరిస్థితులు చూసి నివ్వెరపోతున్నారు. రుద్రేశ్వరుడు, నందీశ్వరుడు ఉండే ప్రాంతాలు..  వివరాలతో  ఓ నాలుగు బోర్డులు మినహా వారికి వేరే  గొప్పదనం ఏం కనిపించట్లేదు. అసంపూర్ణ కల్యాణ మండప పనులు, పడేసినట్లు అక్కడక్కడ రాతి శిల్పాలు.. దిగడానికి వీల్లేని కోనేరును చూసి నిరాశ చెందుతున్నారు. ఎంతో దూరం నుంచి వచ్చే క్రమంలో చెప్పుకోడానికి నాలుగు సెల్ఫీలు దిగుతున్నారు తప్పితే.. అద్భుత కట్టడం చూశామని ఫీలవ్వట్లేదు. 

బిల్లుల  లెక్కలు పంపకపోవడం వల్లే..
2006లో ప్రారంభమైన వెయ్యి స్తంభాల గుడి రిపేర్ల కోసం సెంట్రల్‍ ఆర్కియాలజీ  డిపార్ట్​మెంట్‍ రూ.7.5 కోట్లు కేటాయించింది. తమిళనాడుకు చెందిన స్తపతి శివకుమార్​ ఆధ్వర్యంలో  70 మంది శిల్పకారులు పనులు మొదలుపెట్టారు. రెండేళ్లలో అవి పూర్తి చేసేలా టైం పెట్టుకున్నారు. తీరా.. 15 ఏళ్లు గడిచాయి తప్పితే  పనులు పూర్తి కాలేదు. అప్పట్లోనే అనుకున్న బడ్జెట్‍ కంటే మరో రూ. 6 కోట్ల వ్యయం పెరిగింది. సెంట్రల్‍ ఆర్కియాలజీ  ఇవి కూడా ఇవ్వడానికి  ఓకే అంది. అప్పటివరకు చేసిన పనులకు సంబంధించి ఖర్చుల  వివరాలు పంపిస్తే.. బడ్జెట్‍ రిలీజ్‍ చేస్తామని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆ లెక్కలు పంపలేదు. రూల్స్​కు విరుద్ధంగా కొన్ని పనులు చేయడం వల్లే వాటిని ఇవ్వట్లేదనే ఆరోపణలు వినపడుతున్నాయి. వెయ్యి స్తంభాల గుడి పనులు జరిగేటప్పుడు కల్యాణ మండప నిర్మాణంలో తొలగించిన పిల్లర్స్ ను పద్మాక్షి టెంపుల్‍ శ్మశానవాటిక వద్ద పెట్టారు. మళ్లీ వాటిని బిగించేటప్పుడు కన్‍ఫ్యూజ్​ అవకుండా ఏ పిల్లర్​ ఎక్కడ పెట్టాలో ఈజీగా తెలిసేలా శిల్పులు కలర్స్​తో సింబల్స్ పెట్టుకున్నారు. తీరా 15 ఏండ్ల టైం పట్టడంతో ఎండ, వానలకు అవి ఎక్కడికక్కడ ఉండిపోయాయి. శిల్పులు ఇప్పుడు వాటిని గుర్తుపట్టడం పెద్ద సవాలుగా కానుంది. నాడు తీయించిన ఫొటోలు, వీడియోల ఆధారంగా మళ్లీ పనులు మొదలుపెట్టాల్సి ఉంటుంది. 

గతమెంతో  ఘనం
కాకతీయ ఒకటో రుద్రుడు 1163లో నిర్మించిన అద్భుత కట్టడమే ఈ వెయ్యిస్తంభాల గుడి. అప్పట్లో దీని నిర్మాణానికి డంగు సున్నం, కరక్కాయ పొడి, బెల్లం, ఇటుక పొడి వంటి మిశ్రమాలను వాడారు తప్పితే సిమెంట్‍, ఐరన్‍ జోలికి పోలేదు. 20 ఏళ్ల క్రితం వెయ్యిస్తంభాల గుడి అనగానే..అద్భుత షూటింగ్‍స్పాట్‍గా పేరుండేది. 2004లో విడుదలైన ‘వర్షం’ సినిమాలోని పలు సన్నివేశాలు ఇక్కడే షూట్‍ చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఈ ప్రాంతాన్ని చూడటానికి అప్పట్లో ఎంతో ఉత్సాహం చూపారు. ఆ తర్వాత ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, నా ఆటోగ్రాఫ్​స్వీట్‍ మెమొరీస్‍, సోగ్గాడు, వీర తెలంగాణ, రుద్రమదేవి’ తదితర 17 తెలుగు, 5 హిందీ, మరో రెండు తమిళ సినిమాలు ఇక్కడ షూట్‍ చేశారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంలో మరింత డెవలప్​చేస్తారని ఆశించిన జిల్లావాసులకు నిరాశే ఎదురైంది. ఇక్కడున్న దుస్థితి కారణంగా సినిమావాళ్లు  షూటింగ్‍లకు రావడం బంద్‍ చేశారు.