వరంగల్‍ మెట్రో నియో పట్టాలెక్కట్లే

 వరంగల్‍ మెట్రో నియో పట్టాలెక్కట్లే
  • పేపర్లపైనే సీఎం కేసీఆర్‍, మంత్రి కేటీఆర్‍ హామీ
  • రూ.1,340 కోట్లతో.. 17 కిలోమీటర్ల ప్రాజెక్ట్​ 
  • ఎలక్షన్ల టైంలో హంగామా .. ఇంకా  మొదలు కాని పనులు 
  • రాష్ట్ర బడ్జెట్‍లో హైదరాబాద్‍ మెట్రోకు రూ.1,000 కోట్లు 
  • ఓరుగల్లు ప్రాజెక్టుకు నయా పైసా ఇయ్యలే

వరంగల్‍ అంటే నాకు ఎనలేని ప్రేమ. అందుకే హైదరాబాద్‍ తర్వాత వరంగల్‍ ట్రైసిటీలోనూ  మెట్రో రైల్‍ నడుపుతం. ఎక్కడ కాంప్రమైజ్‍ అవ్వం. త్వరలోనే దీనికి సంబంధించి డీపీఆర్‍ కంప్లీట్‍ చేసి పనులను పట్టాలెక్కిస్తం”.   - సీఎం కేసీఆర్‍ నాలుగేండ్లుగా చెబుతున్న మాట

వరంగల్‍ జనం ఊహించిన దానికంటే వేగంగా నగరంలో ఐటీ రంగాన్ని విస్తరిస్తం. రాబోయే రోజుల్లో వరంగల్‍ ప్రాంతాన్ని ముంబై,  పుణేలా మారుస్తాం. మామునూర్ ఎయిర్‍ పోర్టును పునరుద్దరిస్తం. ఐటీ కంపెనీలకు దగ్గరగా మరో హెలిపోర్టు సెంటర్ పెడతం. ఈజీ జర్నీ కోసం ట్రైసిటీలో మోనోగానీ,  మెట్రో రైలు గానీ ఏదో ఒకటి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. 
- 2020 జనవరి 7న టెక్‍ మహీంద్రా ప్రారంభోత్సవం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ

వరంగల్‍, వెలుగు: హైదరాబాద్‍ తరహాలో వరంగల్‍ మెట్రో నియో ట్రెయిన్‍  పట్టలెక్కడంలేదు. త్వరలోనే పనులు మొదలు పెడతామన్న ప్రభుత్వ పెద్దల హామీ ఏండ్లు గడిచినా అమలు కావడంలేదు. ఎమ్మెల్యే, ఎంపీ, గ్రేటర్‍ వరంగల్​ ఎలక్షన్ల టైంలోనూ, టూర్లలోనూ మెట్రో రైలు వచ్చేస్తుందంటూ హంగామా చేశారు. సర్వేలు, డీపీఆర్‍లు పూర్తయ్యాయి..  టెండర్లు పిలిచి వర్క్స్​ స్టార్ట్​  చేయడమే లేట్‍ అన్నారు. కానీ ఆచరణ ఒక్క అడుగన్నా ముందుకు పడలేదు. 

17 కిలోమీటర్లు.. 21 స్టేషన్లు.. రూ.1,340 కోట్లు 
గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలోనే దాదాపు 11 లక్షల జనాభా ఉంది. కార్ల రద్దీ బాగా పెరిగింది. వరంగల్ రైల్వే స్టేషన్‍ నుంచి హన్మకొండ మీదుగా కాజీపేట రైల్వే స్టేషన్‍ వరకు దాదాపు17 కిలోమీటర్ల దూరం ఫుల్లు రష్‍ ఉంటుంది.   పండుగల రోజుల్లోనైతే కిటకిటలాడుతుంటుంది. రద్దీ దృష్ట్యా నాలుగేండ్ల కిందటే వరంగల్​లో మెట్రో సేవలు అవసరమని ప్రభుత్వం  భావించింది. రూ.1,340 కోట్లతో మెట్రో లేదంటే మోనో రైల్‍ తీసుకురావాలని ప్లాన్​ చేసింది.  కాజీపేట రైల్వే స్టేషన్‍ నుంచి ఫాతిమానగర్‍, సుబేదారి, అంబేడ్కర్ జంక్షన్‍, హన్మకొండ చౌరస్తా, ములుగురోడ్‍, ఎంజీఎం, పోచమ్మ మైదాన్‍, కాశిబుగ్గ, వెంకట్రామ థియేటర్‍ మీదుగా వరంగల్ రైల్వే స్టేషన్‍ వరకు దాదాపు 21 స్టేషన్లతో రూట్‍ మ్యాప్‍ రెడీ చేసింది.  

 సర్వేలు, డీపీఆర్‍లతో సరి 
 వరంగల్‍ మెట్రో నియో వ్యవహారాలను  కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ (కుడా) మానిటరింగ్‍ చేసింది. జిల్లా కలెక్టర్‍, గ్రేటర్‍ కార్పొరేషన్‍ ఆఫీసర్లు  సర్వే చేయించారు. వరంగల్​ మెట్రో ప్రాజెక్ట్​ ఫీజిబిలిటీపై  మహారాష్ట్ర మెట్రో రైల్‍ కార్పొరేషన్‍ లిమిటెడ్‍ స్టడీ చేసింది. మహా మెట్రో, నాగపూర్‍, హైదరాబాద్‍, పూణే లకు చెందిన  టెక్నికల్‍ కమిటీ డీపీఆర్‍ తయారు చేసింది. ఇక పనులు అవు తాయనుకుంటున్న టైంలో ప్రాజెక్ట్​ను పక్కనపెట్టారు.

హైదరాబాద్‍కు రూ.1000 కోట్లు.. ఓరుగల్లుకు నిల్‍ 
వరంగల్ మెట్రో రైల్‍ నిర్మాణ విషయంలో సీఎం కేసీఆర్‍, మంత్రి కేటీఆర్‍, జిల్లాకు చెందిన లీడర్లు చెప్పే మాటలకు.. చేస్తున్న పనులకు పొంతన ఉండడంలేదు. మొన్నటి రాష్ట్ర బడ్జెట్‍లో  హైదరాబాద్‍ మెట్రోకు టీఆర్‍ఎస్‍ ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. వరంగల్‍ మెట్రో పనులకు మాత్రం ఫండ్స్​ ఇవ్వలేదు.  అయినా ఇక్కడి  పెద్ద లీడర్లు  నోరు మెదపడంలేదు. దీంతో  జెట్‍ స్పీడుతో జరగాల్సిన  మెట్రో రైల్‍ పనులు 
మొదలేకాలేదు.