ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రూ.4675 కోట్ల బకాయిలు రావాలి

ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రూ.4675 కోట్ల బకాయిలు రావాలి
  • సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడుతాం: అశ్వ త్థామ రెడ్డి

హైదరాబాద్: కార్మికుల సమస్యలను మరోసారి హైకోర్టు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశామని ఇవాళ కోర్టు విచారణ ముగిశాక ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. నాలుగు డిమాండ్లకే రూ.47 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం వాదించిందన్నారు. ఆ నాలుగే కాదు తమ డిమాండ్లన్నీనెరవేర్చాల్సిందేనని అన్నారాయన.

ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన పెడింగ్ బకాయిల గురించి ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు అశ్వత్థామరెడ్డి. సర్కార్ నుంచి కార్పొరేషన్ కు మొత్తం రూ.4675 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందన్నారు. బస్ పాసుల సబ్సిడీకి సంబంధించి రూ.1099 కోట్లు, మునిసిపల్ యాక్ట్ కింద రూ.1300 కోట్లు, ప్రభుత్వం నుంచి మరో రూ.2276 కోట్లు రావాలని చెప్పారు. ఈ బకాయిలపై క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందన్నారు.

కార్మికులు అధైర్యపడొద్దు

ప్రభుత్వం అన్ని డిమాండ్లను నెరవేర్చేవరకూ పోరాటం ఆగదని అశ్వత్థామరెడ్డి చెప్పారు. చర్చలకు వెళ్లినప్పుడు మధ్యలోనే వచ్చేశామన్నదానిపై కోర్టు సీరియస్ గా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. కార్మికులెవరూ అధైర్యంపడొద్దని సూచించారు అశ్వత్థామ రెడ్డి. క్షనికావేశంలో ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. ఐక్యంగా అందరం కలిసి పోరాడి సాధించుకుందామని చెప్పారు.