జీహెచ్‌‌ఎంసీ పరిధిలో అగ్గువకే ఇండ్లు..నిర్మాణానికి ఉచితంగా హౌసింగ్ బోర్డు స్థలాలు

జీహెచ్‌‌ఎంసీ పరిధిలో అగ్గువకే ఇండ్లు..నిర్మాణానికి ఉచితంగా హౌసింగ్ బోర్డు స్థలాలు

 

  • ఆ స్థలాల్లోనే ఎల్‌‌ఐజీ, ఎంఐజీ టవర్ల నిర్మాణం
  • ఒక్కో ఫ్లాట్‌‌పై సగటున రూ. 10 లక్షల వరకు రాయితీ

హైదరాబాద్, వెలుగు: సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్న నగరవాసులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నగర పరిధిలో ఇండ్లు లేని మధ్యతరగతి, పేద కుటుంబాల కోసం హౌసింగ్ బోర్డు భూముల్లో సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిం ది. ఉచితంగా ప్రభుత్వ స్థలాలను కేటాయించడంతోపాటు నిర్మాణ వ్యయంలో కొంత భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ లబ్ధిదారులకు భారీ ఊరట కల్పించనుంది. జీహెచ్‌‌ఎంసీ పరిధిలో ఎల్‌‌ఐజీ (లో ఇన్‌‌కమ్ గ్రూప్), ఎంఐజీ (మిడిల్ ఇన్‌‌కమ్ గ్రూప్) టవర్లను ప్రభుత్వం నిర్మించనుంది.

ఇందుకు సంబంధించిన స్థలాల ఎంపిక తుది దశకు చేరుకుంది. మొత్తం 26 నియోజకవర్గాలు ఉండగా, వాటిలో 20 నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డుకు చెందిన భూములు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో సుమారు ఐదు ఎకరాల చొప్పున భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెవెన్యూ శాఖతోపాటు ఇతర శాఖలకు చెందిన భూములు ఎక్కడెక్కడ, ఎంత మేర అందుబాటులో ఉన్నాయనే వివరాలను అధికారులు సర్వే చేస్తున్నారు.

ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయం..

ఎల్‌‌ఐజీ, ఎంఐజీ టవర్లలో నిర్మించే ఒక్కో ఫ్లాట్ నిర్మా ణ వ్యయం సుమారు రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 600 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించనున్న ఫ్లాట్ల నిర్మాణ వ్యయంపై బిల్డర్లతో అధికారులు ఇప్పటికే చర్చలు జరిపారు. 1 బీహెచ్‌‌కే ఫ్లాట్ రూ.15 లక్షలలోపే పూర్తి చేయాలని నిర్ణయించారు. 2 బీహెచ్‌‌కే ఫ్లాట్ 800 నుంచి 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 25 లక్షలలోపే నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇం దులో సగం మొత్తాన్ని మాత్రమే లబ్ధిదారులు చెల్లించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. టవర్ల నిర్మాణానికి అవసరమైన హౌసింగ్ బోర్డు భూమిని ఉచితంగా కేటాయించడంతోపాటు ప్రతి ఫ్లాట్‌‌కు రూ.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల సాయాన్ని రాయితీ రూపంలో ప్రభుత్వం వర్తింపజేయనుంది. లబ్ధిదారులపై అదనపు భారం పడకుండా రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అనంతరం ఇంటిని లబ్ధిదారుడి పేరిట రిజిస్టర్ చేస్తా రు. స్థలం విలువ, సబ్సిడీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు తదితర ప్రయోజనాలను కలిపి చూస్తే ఎల్‌‌ఐజీ టవర్‌‌లోని ఒక్కో ఫ్లాట్‌‌పై లబ్ధిదారుడికి సగటున రూ. 10 లక్షల వరకు రాయితీ లభించే అవ కాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఫ్లాట్లలో లబ్ధిదారులు కొంత మొత్తాన్ని భరించాల్సి ఉండటంతో ఈ పథకంపై ఎంత మంది ఆసక్తి చూపుతున్నారనే అంశాన్ని తెలుసుకునేందుకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు హౌసింగ్ అధికారులు తెలిపారు.