కల్తీ కట్టడికి స్పెషల్ ఫోర్స్!.. హైడ్రా తరహాలో ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు

కల్తీ కట్టడికి స్పెషల్ ఫోర్స్!.. హైడ్రా తరహాలో ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు
  • సెర్చ్ అండ్ సీజ్‌‌‌‌‌‌‌‌తో పాటు భారీగా పెనాల్టీలు విధించేలా విస్తృత అధికారాలు
  • వివిధ శాఖల అధికారులతో కూడిన ఫోర్స్‌‌‌‌‌‌‌‌కు బాస్‌‌‌‌‌‌‌‌గా సీనియర్ ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ను నియమించే యోచన
  • సీఎం ఆదేశాల మేరకు ప్రతిపాదనలు రెడీ.. త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చే ప్లాన్​ 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిత్యావసర వస్తువుల కల్తీ ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేందుకు ప్రభుత్వం అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో సంచలనం సృష్టిస్తున్న ‘హైడ్రా’.. గంజాయి, డ్రగ్స్​ ముఠాల పాలిట శత్రువుగా మారిన ‘ఈగల్’ తరహాలోనే​ కల్తీల నియంత్రణ కోసం ఒక పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ ‘స్పెషల్ ఫోర్స్’ ఏర్పాటుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది. కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా.. కల్తీగాళ్లపై ‘సెర్చ్ అండ్ సీజ్’ ఆపరేషన్లు నిర్వహించడంతోపాటు భారీగా జరిమానాలు విధించేలా ఈ విభాగానికి విస్తృత అధికారాలు కట్టబెట్టనున్నారు.

మున్సిపల్, రెవెన్యూ, హెల్త్, పోలీస్ శాఖల అధికారులతో కలిపి రూపుదిద్దుకోనున్న ఈ ప్రత్యేక విభాగానికి సారథిగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించే యోచనలో ప్రభుత్వం ఉంది. సీఎం ఆదేశాల మేరకు ఈ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. నగరంలో చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ‘హైడ్రా’ ఏ విధంగానైతే ఉక్కుపాదం మోపుతోందో.. అదే దూకుడుతో కల్తీ సామ్రాజ్యంపై విరుచుకుపడేలా ఈ కొత్త వ్యవస్థను డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫుడ్ సేఫ్టీ విభాగానికి పరిమిత సిబ్బంది, నామమాత్రపు అధికారాలు ఉండటంతో కల్తీగాళ్లు చట్టంలోని లొసుగులను వాడుకొని తప్పించుకుంటున్నారు. ఈ బలహీనతను అధిగమించేందుకే సర్కారు సర్వాధికారాలు గల ప్రత్యేక విభాగాన్ని తెరపైకి తెస్తోంది. మార్కెట్లో దొరికే పాలు, నూనెలు, మసాలాల నుంచి హోటళ్లలో లభించే ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్కదానిపై ఈ ఫోర్స్ నిరంతర నిఘా ఉంచనుంది.


ఈ స్పెషల్ ఫోర్స్‌కు కేవలం శాంపిల్స్ సేక రించే అధికారం మాత్రమే కాకుండా.. నేరుగా తయారీ కేంద్రాలపై దాడులు చేసి, సరుకును, సంబంధిత హోటల్‌ను సీజ్  చేసేలా చట్టపరమైన వెసులుబాటు కల్పించనున్నారు. కల్తీకి పాల్పడే సంస్థల లైసెన్సులను రద్దు చేయడంతోపాటు కోట్లాది రూపాయల భారీ పెనాల్టీలు విధించేలా నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. కల్తీ వెనుక ఎంతటి అండదండలు ఉన్నా వదిలిపెట్టకూడదనే స్పష్టమైన సంకేతాలతో, నిందితులపై నాన్-బెయిలెబుల్ కేసులు నమోదు చేసేలా ఈ విభాగానికి ప్రత్యేక న్యాయ విభాగాన్ని కూడా అనుసంధానించనున్నారు.

సీఎం ఆదేశాలతో వేగంగా ప్రతిపాదనలు

ప్రజల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడబోమంటూ సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఈ ప్రతిపాదనలకు తుది రూపం ఇచ్చారు. ఈ స్పెషల్ ఫోర్స్ నిర్మాణం ఎలా ఉండాలి? నిధుల కేటాయింపులు, చట్టపరమైన అధికారాల పరిధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నివేదికను సిద్ధం చేశారు. త్వరలోనే దీనికి కేబినెట్‌లో ఆమోద ముద్ర వేసి, ఉత్తర్వులు ఇచ్చేందుకు  ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ వ్యవస్థ గనుక అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో కల్తీ మాఫియా ఆటకట్టడం ఖాయమని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 
కల్తీగాళ్లపై ‘హెచ్ -ఫాస్ట్’ ఉక్కుపాదం..

173 కేసులు 

హైదరాబాద్‌లో కల్తీ మాఫియా ఆటకట్టించేందుకు రంగంలోకి దిగిన ‘హెచ్ -ఫాస్ట్’ విభాగానికి సంబంధించిన   ప్రత్యేక ఫోర్స్ జరిపిన మెరుపు దాడుల్లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో మొత్తం 173 కేసులు నమోదయ్యాయి. జోన్లవారీగా చూస్తే అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్‌లో 51 కేసులు, గోల్కొండ జోన్‌లో 42, సికింద్రాబాద్ జోన్‌లో 33 కేసులు నమోదు కాగా, చార్మినార్‌లో 19, జూబ్లీహిల్స్, శంషాబాద్ జోన్లలో చెరో 12 చొప్పున, ఖైరతాబాద్ జోన్‌లో 4  కేసులు నమోదయ్యాయి. ఈ దాడులలో అధికారులు సుమారు 94,850.2 కేజీల భారీ మొత్తంలో కల్తీ సరుకును సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, తదుపరి చట్టపరమైన నిబంధనల నిమిత్తం ఇందులో 36 కేసులను జీహెచ్‌ఎంసీకి చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు బదిలీ చేశారు.  ఈ దాడుల్లో నిత్యం ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులే టార్గెట్‌గా కల్తీ జరుగుతున్నట్టు తేలింది.

ఇందులో అత్యధికంగా 26 అల్లం వెల్లుల్లి పేస్ట్ కేసుల్లో ఏకంగా 26,608.2 కేజీల కల్తీ సరుకు దొరకగా, కృత్రిమంగా పండించే 16 పండ్ల కేసుల్లో 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు. వీటితోపాటు దాదాపు 15 టన్నుల కల్తీ చికెన్, మాంసం, 8,960 కేజీల ఊరగాయలు, 4,030 కేజీల కోవా, 3,897 కేజీల టీ పౌడర్, 2,500 కేజీల పెరుగు, 1,514 కేజీల పనీర్‌ను హెచ్- ఫాస్ట్ అధికారులు పట్టుకున్నారు. వీటితో పాటు ఐస్‌క్రీమ్స్ (15 కేసులు), ఆర్‌ఓ ప్లాంట్ నీళ్లు (11 కేసులు), బిస్కెట్లు, నెయ్యి, నూడుల్స్, స్వీట్లు, వివిధ రకాల మసాలాల తయారీ కేంద్రాలపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు. అయితే వీరికి హోటల్స్​ సీజ్​ చేయడం,   భారీగా పెనాల్టీలు వేయడం, నాన్​ బెయిలెబుల్​ కేసులతో జైలు శిక్షలాంటి అధికారాలు లేవు.

ఐపీఎస్ బాస్.. నలుదిక్కులా నిఘా

ఈ ప్రత్యేక వ్యవస్థను అత్యంత పటిష్టంగా నడిపించేందుకు ఒక డైనమిక్ సీనియర్ ఐపీఎస్ అధికారిని బాస్‌గా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించకుండా.. మున్సిపల్, రెవెన్యూ, హెల్త్, పోలీస్ విభాగాల నుంచి సమర్థులైన అధికారులను డిప్యూటేషన్‌పై ఈ ఫోర్స్‌లోకి తీసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో దాడులు చేయడానికి పోలీస్ బలం, చట్టపరమైన చర్యలకు రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ, నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు హెల్త్ ఇన్‌స్పెక్టర్లు.. ఇలా అంతా ఒకే గొడుగు కిందకు వచ్చి ఉమ్మడి ఆపరేషన్లు నిర్వహించనున్నారు.