V6 News

మహిళల భద్రత, సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట : రాష్ట్ర మంత్రి సీతక్క

మహిళల భద్రత, సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట :  రాష్ట్ర మంత్రి సీతక్క

కామారెడ్డి, వెలుగు: మహిళల భద్రత, సాధికారతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సఖి కేంద్రాన్ని ప్రారంభించారు. చిన్నారుల భద్రత అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్​లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హింసకు గురైన మహిళలకు ఒకే చోట వైద్యం, పోలీస్, న్యాయం, కౌన్సిలింగ్​ సేవలు అందించటమే సఖి సెంటర్​ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. లైంగిక దాడి, గృహహింస కేసుల్లో వెంటనే స్పందించాలని ఆదేశించారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం  చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 

అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రతి ఊరికి తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పనులు స్పీడప్​ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, జహీరాబాద్​ ఎంపీ సురేశ్​ షేట్కార్, ఉమెన్​ వెల్ఫేర్​ స్టేట్​ సెక్రెటరీ అనిత రామచంద్రన్, కలెక్టర్  ఆశిష్​ సంగ్వాన్, మున్సిపల్​ చైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి పాల్గొన్నారు.