
- వరుసగా రెండో ఏటా పుస్తకాలధరలు తగ్గించిన ప్రభుత్వం
- ఒక్క టెన్త్ లోనే రెండేండ్లలో రూ. 404 మేరకు తగ్గింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెక్స్ట్ బుక్స్ ధరలు మరింత తగ్గాయి. గతేడాది ధరలను భారీగా తగ్గించిన ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా రేట్లను స్వల్పంగా తగ్గించింది. వరుసగా రెండో ఏడాది పాఠ్య పుస్తకాల ధరలను తగ్గించడంపై పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 41 వేలకు పైగా స్కూళ్లుండగా, వాటిలో 62 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. సర్కారు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పుస్తకాలను అందిస్తోంది.
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల కోసం 2025–26 అకడమిక్ ఇయర్ కు గాను ఇప్పటికే 1.44 కోట్ల పుస్తకాలను జిల్లాలకు పంపించారు. ప్రైవేటు బడుల్లో చదివే 36 లక్షల మంది విద్యార్థులు మాత్రం పాఠ్య పుస్తకాలను బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సిందే. అయితే, ఐదో తరగతి వరకూ ఇతర పుస్తకాలు వాడినా.. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ తప్పనిసరిగా ప్రభుత్వం తయారుచేసిన సిలబస్ నే చదవాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వమే పుస్తకాలను ప్రింట్ చేసి, బయట మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
గతేడాది భారీగా తగ్గిన రేట్లు..
ఒక్కో క్లాసుకు రూ. 10 నుంచి రూ.50 వరకూ రేట్లు తగ్గాయి. టెన్త్ క్లాస్ సబ్జెక్టులపై రూ.48 తగ్గగా, 9వ తరగతికి రూ.36, 8వ తరగతికి రూ.34, 7వ తరగతికి రూ.30, 6వ తరగతికి రూ.23 రేట్లు తగ్గాయి. ప్రైమరీ క్లాసులకు రూ.10లోపే ధర తగ్గింది. అయితే, ఒక్కో క్లాసులో అన్ని సబ్జెక్టులపై కలిపి రెండేండ్లలో రూ.300 నుంచి రూ.400 వరకూ రేట్లు తగ్గడంపై పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు టెన్త్ లో అన్ని పుస్తకాలకు అయ్యే ఖర్చు 2023–24లో రూ.1,482 ఉండగా, గతేడాది 2024–25లో రూ.1,126కు తగ్గింది.
ప్రస్తుతం ఆ రేటు రూ.1,078కి తగ్గింది. పేపర్ రేటు తగ్గడం వల్లే పుస్తకాల రేట్లు స్వల్పంగా తగ్గినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ రేట్లకు పుస్తకాలు అమ్మితే, చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు బుక్స్ షాపుల యాజమాన్యాలను హెచ్చరిస్తున్నారు.