- విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వ్యవసాయ శాఖ, స్రీ, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ ఆధునీకరణ యంత్రాలు, దివ్యాంగులకు ఉపకరణాలను వేములవాడ మార్కెట్ యార్డ్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఆధునీకరణ కోసం ప్రభుత్వం సబ్సిడీపై యంత్రాలను పంపిణీ చేస్తోందన్నారు.
దివ్యాంగుల కోసం ప్రభుత్వం స్కూటీ రెట్రోఫిటెడ్, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు అందజేస్తుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిసారీ ఒకే పంట సాగు చేస్తే నేల నిస్సారమవుతుందన్నారు. అన్ని కాలాలకు అనుకూలంగా ఉండే 30ఏండ్లపాటు ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
అనంతరం సర్పంచులకు నిర్వహించిన ఓరియేంటేషన్ కార్యక్రమంలో విప్ పాల్గొని మాట్లాడారు. సర్పంచులు గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో జాతీయ క్షయ నిర్మూలనలో భాగంగా టీబీ బాధితులకు పోషకాహార కిట్లు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఆర్డీవో రాధాబా, డీఏవో అఫ్జల్ బేగం, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం పాల్గొన్నారు.
