సర్కారీ బడులు : మే 31 వరకు స్కూళ్లకు నోట్ బుక్స్ చేరాలి.. డేటా ఆన్ లైన్ కంపల్సరీ..

సర్కారీ బడులు : మే 31 వరకు స్కూళ్లకు నోట్ బుక్స్ చేరాలి.. డేటా ఆన్ లైన్ కంపల్సరీ..
  • డేటాను వెంటనే ఆన్‌‌లైన్ ట్రాకర్‌‌లో అప్‌‌లోడ్ చేయాలి
  • స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న  విద్యార్థులకు మే 31వ తేదీ కల్లా నోట్ బుక్స్ పంపిణీ పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. 2026-–27 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు మొత్తం 1.39 కోట్ల పుస్తకాలను స్కూళ్లకు చేరవేయాలని డీఈవోలకు డెడ్‌‌లైన్ విధించారు. 

ఈ మేరకు గురువారం ఆయన ఉత్తర్వులు జారీచేశారు. సమగ్ర శిక్ష కింద 1,13,76,324 పుస్తకాలు, పీఎం శ్రీ స్కూళ్ల కోసం 25,90,278 పుస్తకాలను కేటాయించింది. గవర్నమెంట్, లోకల్ బాడీ, మోడల్ స్కూల్స్, కేజీబీవీ, టీఆర్ఈఐఎస్ , అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలోని విద్యార్థులకు ఇవి అందించనున్నారు.  ఏప్రిల్ 22 నుంచి సరఫరా ప్రక్రియ మొదలైందని, మే 31 కల్లా ఇది పూర్తి కావాలని నవీన్ నికోలస్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

పుస్తకాలు అందుకున్న వెంటనే హెచ్‌‌ఎంలు రశీదు ఇచ్చి, ఐఎస్ఎంఎస్ పోర్టల్‌‌తో పాటు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ డెలివరీ ట్రాకర్‌‌లో వివరాలను వెంటనే అప్‌‌లోడ్ చేయాలని ఆదేశించారు. టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్‌‌తో పాటు నోట్ బుక్స్ పంపిణీలోనూ పారదర్శకత ఉండాలని, డేటా ఎంట్రీలో ఎలాంటి జాప్యం జరగకూడదని డైరెక్టర్ స్పష్టం చేశారు. పుస్తకాల సరఫరాలో ఏవైనా సమస్యలుంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

ఈ ప్రక్రియను ఎంఈవోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, విద్యార్థులు లేని స్కూళ్ల నుంచి పుస్తకాలను తిరిగి డీఈవో ఆఫీసులకు పంపాలన్నారు. జూన్‌‌లో స్కూళ్లు తెరిచే నాటికి ప్రతి విద్యార్థి చేతిలో పుస్తకాలు ఉండాలని, పంపిణీలో ఏమాత్రం జాప్యం జరిగినా అధికారులదే బాధ్యత అని ఆయన హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు