స్పౌజ్, సీఎంవో బదిలీలతో మారుతున్న సీనియార్టీ లిస్టులు 

స్పౌజ్, సీఎంవో బదిలీలతో మారుతున్న సీనియార్టీ లిస్టులు 
  • ఎనిమిది, ఐదేండ్ల సర్వీస్ పూర్తయిన వారికి తప్పనిసరి
  • ఇయ్యాల్టి నుంచి ఆన్​లైన్​లో అప్లికేషన్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ల ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్ల ప్రక్రియ స్టార్ట్​ అయింది. రాష్ట్రంలో ఒకే స్కూల్​లో ఎనిమిదేండ్ల సర్వీస్ ​పూర్తయిన స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, ఐదేండ్ల సర్వీస్​ నిండిన హెడ్మాస్టర్లు సుమారు 25 వేల మంది ఉన్నారు. వీరంతా ట్రాన్స్​ఫర్​కు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. అయితే, మూడేండ్లలో రిటైర్​ అయ్యే టీచర్లు, హెడ్మాస్టర్లు ట్రాన్స్​ఫర్ల నుంచి మినహాయింపు  పొందే అవకాశముంది. అలాగే, రెండేండ్ల స్టేషన్ సర్వీస్ పూర్తయిన టీచర్లు కూడా బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ లెక్కన మరో 25 వేల మంది అప్లై చేసుకునే చాన్స్​ ఉందని అధికారులు చెప్తున్నారు.

మూడు రోజుల పాటు దరఖాస్తులు

శనివారం నుంచి మూడు రోజుల పాటు (28 నుంచి 30 వరకు) టీచర్లు ఆన్​లైన్​ లో అప్లై చేసుకోవాలి. వాటి హార్డ్ కాపీలను హైస్కూల్ టీచర్లు హెడ్మాస్టర్లకు, గవర్నమెంట్ ప్రైమరీ, యూపీఎస్​టీచర్లు ఎంఈవోలకు, మండల పరిషత్, యూపీఎస్​ టీచర్లు కాంప్లెక్స్ హెడ్మాస్టర్లకు, హైస్కూల్ హెడ్మాస్టర్లు డీఈవోలకు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు అందజేయాలి. డీఈవో ఆఫీసులో వాటిని పరిశీలించి ఆమోదిస్తారు. ఫిబ్రవరి 11,12 తేదీల్లో ఫైనల్ సీనియార్టీ లిస్టులు, హెచ్​ఎంల బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు, 14న హెడ్మాస్టర్ల బదిలీ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఖాళీల వివరాలు, ఆయా స్థానాల్లో ఎస్జీటీల ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగనున్నది.

మారుతున్న సీనియార్టీ లిస్టులు

అన్ని జిల్లాల్లో టీచర్ల సీనియార్టీ లిస్టులను అధికారులు ఇప్పటికే రెడీ చేశారు. అయితే, గురువారం 427 మంది స్పౌజ్ ట్రాన్స్​ఫర్లతో పాటు సీఎంవో నుంచి మరో 120 వరకు ట్రాన్స్​ఫర్ ఆర్డర్లు డీఈవోలకు అందాయి. దీంతో సీనియార్టీ లిస్టుల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. సీఎంవో నుంచి వచ్చిన బదిలీ ఆర్డర్లకు నేరుగా పోస్టులు ఇస్తున్నారు. స్పౌజ్ టీచర్లకు శుక్రవారం కొన్ని జిల్లాల్లో డీఈవోలు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్​లు ఇచ్చారు. మరికొన్ని జిల్లాల్లో కలెక్టర్లు లేక ఆ ప్రక్రియ కాలేదని తెలుస్తోంది. దీంతో ఆయా జిల్లాల్లో ఖాళీల వివరాలు, సీనియార్టీ లిస్టుల తయారీ ఆలస్యమయ్యే అవకాశముంది. 

అయోమయంలో డీఈవోలు

టీచర్ల ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లకు సంబంధించి అన్ని కేటగిరీల్లో ఖాళీలు, హెడ్మాస్టర్ పోస్టుల ప్రమోషన్​కు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ సీనియార్టీ లిస్టులను ప్రకటించాల్సి ఉంది. అయితే, స్కూల్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ అధికారులు గురువారం స్పౌజ్ లిస్టులు రిలీజ్ చేసి, శుక్రవారం కొత్త  సీనియార్టీ లిస్టులు తయారు చేయమనడంతో డీఈవోలు అయోమయానికి గురవుతున్నారు. ముందే ఆర్డర్లు ఇచ్చి, ఆ తర్వాత షెడ్యూల్, గైడ్​లైన్స్ ఇస్తే సమస్య ఉండకపోయేదని చెప్తున్నారు. రాత్రికి రాత్రి ఆర్డర్లు ఇచ్చి, తెల్లారే లిస్టు పెట్టాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో చాలా జిల్లాల్లో అర్ధరాత్రి వరకూ లిస్టులు పెట్టలేదు. స్పౌజ్​ కేటగిరీలో మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉండటంతో డీఈవోలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాగే ఒత్తిడి తీసుకొస్తే మళ్లీ 317 జీవో లాగే సమస్యలు వచ్చే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.