- జీవో 7 పత్రాలు దగ్ధం చేసిన బీసీ విద్యార్థి నేతలు
అంబర్పేట్, వెలుగు: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలను ఎత్తివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్ యాదవ్ ఆరోపించారు. పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేయడానికే జీవో నంబర్ 7ను తీసుకువచ్చారని మండిపడ్డారు. ఆదివారం అంబర్పేట్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో జీవో పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 13 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని ప్రభుత్వం రోజురోజుకూ నీరుగారుస్తోందని విమర్శించారు.
ఏటా రూ. 2,500 కోట్లు కేటాయిస్తే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయని, కానీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ముకాస్తోందని ఫైరయ్యారు. ముఖ్యమంత్రి వద్దే విద్యాశాఖ ఉన్నందున, తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, గుంటి మహేశ్, అనంతుల సాయి, పవన్ గౌడ్ పాల్గొన్నారు
