సూర్యాపేట, వెలుగు: కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా అత్యాధునిక సాంకేతిక అవకాశాలు దక్కాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ శిక్షణ అందిస్తున్నట్లు సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాంకేతికత అందిపుచ్చుకునేలా సూర్యాపేట జిల్లా అధికారులు డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్య అందించేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
టీ-ఫైబర్, సూపర్ టీచర్ ఎడ్యు రిఫార్మ్స్ సంస్థల సహకారంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం చేపట్టనున్న నెల రోజుల ఏఐ శిక్షణా కార్యక్రమం పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఈనెల 15 నుంచి జూలై 11 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. మొదటి విడతగా జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో దీనిని నిర్వహించనున్నారు.
