నానుతున్న గోడలు..నెర్రెల్లోంచి ఊటలు..

నానుతున్న గోడలు..నెర్రెల్లోంచి ఊటలు..

భయం భయంగా బడికి..
ఇటీవలి వానలకు దెబ్బతిన్న సర్కార్​ బడులు
ప్రమాదకరంగా స్లాబులు, ఊడుతున్న పెచ్చులు

వెలుగు, నెట్​వర్క్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల వారం రోజులుగా బందైన సర్కారు బడులు సోమవారం తెరుచుకోనున్నాయి. అసలే శిథిలావస్థకు చేరిన బిల్డింగులు, తాజాగా కురిసిన వానలకు మరింత అధ్వానంగా తయారయ్యాయి. చాలా చోట్ల స్లాపులు ఉరుస్తుంటే, ఇంకొన్నిచోట్ల పెచ్చులూడి మీదపడ్తున్నాయి. ఇటీవల మహబూబ్​నగర్​ జిల్లా వీరన్నపేటలో, ములుగు జిల్లా కొత్తూరు  ప్రాథమిక పాఠశాలల్లో పెచ్చులూడి పడ్డాయి. కానీ, సెలవులు కావడంతో స్టూడెంట్లకు ప్రమాదం తప్పింది.  ఇక ప్రహరీలు, పాడుబడ్డ టాయిలెట్ల గోడలు ఎప్పుడు కూలి మీదపడ్తాయో అన్నట్లుగా భయపెడ్తున్నాయి. స్కూల్​ ఆవరణలన్నీ ఇప్పటికీ నీళ్లు, బురద, చెత్తతో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బడులకు తమ పిల్లలను పంపేందుకు పేరెంట్స్​ జంకుతున్నారు.

90 శాతానికి పైగా స్కూళ్లు శిథిలం.. 
రాష్ట్రవ్యాప్తంగా 26 వేల సర్కారు  బడులుండగా, ‘మన ఊరు.. మనబడి’ స్కీం కింద  రూ.7,290 కోట్లతో మూడు విడుతల్లో మౌలిక వసతులు కల్పిస్తామని  ప్రభుత్వం గతేడాది ప్రకటించింది. మొదటి విడత  రూ.3,497 కోట్లతో 9,123 బడులను డెవలప్ చేయాల్సి ఉంది. కానీ, గతేడాది రూ.300 కోట్లే కేటాయించడంతో మండలానికి రెండు స్కూళ్ల చొప్పున 1200 (4.6శాతం) బడులకు మాత్రమే రిపేర్లు చేసి, సౌలతులు కల్పించారు. 

మిగిలిన 95శాతం స్కూళ్లు ఇప్పటికీ శిథిలావస్థలోనే ఉన్నాయి. ‘మన ఊరు మన బడి’ స్కీం ప్రారంభించాక కనీసం రిపేర్లకు కూడా పైసలు ఇవ్వకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. తాజా వర్షాలకు స్కూళ్ల ఆవరణలో వరద నిలిచి పాతబిల్డింగుల పునాదులు నానుతున్నాయి. చిన్న వర్షం పడినా నెర్రెలు బారిన స్లాపులు, గోడల్లోంచి నీళ్లు ఉరుస్తున్నాయి.

జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం లాంటి జిల్లాల్లో పక్కా భవనాలు లేని సర్కారీ స్కూళ్లు వందల్లో ఉన్నాయి. వీటిని తాత్కాలిక భవనాల్లో, పాకల్లో, పెంకుటిండ్లలో నిర్వహిస్తుండగా, ఇటీవలి వర్షాలు, వరదలకు చాలామటుకు కొట్టుకపోయాయి. నేటి నుంచి ఎక్కడ తరగతులు నిర్వహించాలో తెలియక టీచర్లు
 తలపట్టుకుంటున్నారు. 

ఇది మహబూబ్​నగర్ ​జిల్లా కేంద్రంలోని వీరన్నపేటలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​లోని ఫోర్త్​క్లాస్​ రూమ్ ​పరిస్థితి. వానలకు మంగళవారం ఉదయం క్లాస్ రూమ్ పైకప్పు పెచ్చులూడింది. నిరుడు ‘మన ఊరు-మన బడి’ స్కీం కింద ఈ క్లాస్ రూమ్​ను డిస్మెటల్ చేసి కొత్తది కట్టాల్సి ఉంది. కానీ, గవర్నమెంట్ బడ్జెట్ తక్కువగా రిలీజ్ చేయడంతో కాంట్రాక్టర్ పనులు చేయలేదు.

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కొత్తూరులోని ప్రైమరీ స్కూల్ భవనం ఇది . పాతపడి శిథిలావస్థకు చేరడంతో గత వారం తరగతి గదుల్లో స్లాబ్ పెచ్చులూడి పడ్డాయి. ఆ రోజు వర్షాల వల్ల సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు స్కూల్​కు రాలేదు. దీంతో ప్రమాదం తప్పింది. 

చూడడానికి పాకలాగా కనిపిస్తున్నా ఇది ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఎలిసెట్టిపల్లిలోని ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 20 మంది స్టూడెంట్స్,
 ఓ టీచర్ ​ఉన్నారు. ఈ స్కూల్​బిల్డింగ్​ శిథిలావస్థకు చేరడంతో పోయినేడాది కూల్చివేశారు. అప్పటి నుంచి ఈ గుడిసెలో తరగతులు నిర్వహిస్తున్నారు. వర్షాలు వచ్చినప్పుడు ఎదురుగా ఉన్న అంగన్​వాడీ బిల్డింగ్​లో క్లాసులు చెబుతారు. ఏజెన్సీ ఏరియాలో సర్కారు చదువుకు ఇదొక నిదర్శనం. 

 ఈ నెల 21న సూర్యాపేట జిల్లా మునగాలకు వచ్చిన  కలెక్టర్ వెంకట్రావు హరిజన కాలనీ లోని సీపీఎస్​ స్కూల్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవనం పెచ్చులూడిపోయి కురుస్తుండడంతో రిపేర్లు ఎందుకు చేయలేదంటూ విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.