
- ఉమ్మడి జిల్లాకు చేరుతున్న పుస్తకాలు
- మహిళా సంఘాల ఆధ్వర్యంలో సిద్ధమవుతున్న యూనిఫాం
- జతకు రూ.70 చొప్పున కుట్టుకూలి
ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో లేని విధంగా స్కూళ్లు రీ ఓపెన్ అయ్యే నాటికి స్టూడెంట్స్ కు బుక్స్, యూనిఫాం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన పనులు చకచక జరుగుతున్నాయి. ఇప్పటికే విద్యార్థులకు అవసరమైన పుస్తకాల్లో సగానికి పైగా ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలకు చేరాయి. వాటిని ఈనెలాఖరు నాటికి అన్ని మండలాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ లోగానే మిగిలిన పుస్తకాలు కూడా వచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. అదే సమయంలో ఒక జతకు సరిపోయే యూనిఫాం క్లాత్ కూడా జిల్లాలకు చేరింది. వాటిని మహిళా సంఘాలకు అప్పగించగా ఇప్పటికే సగానికిపైగా డ్రెస్సులు కుట్టారు. ఈలోగా రెండో జతకు అవసరమైన క్లాత్ కూడా వస్తే స్కూళ్లు ప్రారంభమయ్యే వరకు స్టిచ్చింగ్కంప్లీట్ చేయిస్తామని ఆఫీసర్లు చెబతున్నారు.
ఎక్కడ.. ఎన్ని పుస్తకాలు..?
స్కూల్ బుక్స్ విషయంలో ఖమ్మం జిల్లా కంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎక్కువ మొత్తంలో పుస్తకాలు చేరుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 5,08,400 పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 3,36,200 పుస్తకాలు (66.13 శాతం) చేరుకున్నాయి. ఇంకా 1,72,200 పుస్తకాలు మాత్రమే రావాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో 6,59,570 పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటి వరకు పార్ట్ 1 పుస్తకాలు 2,55,690 మాత్రమే ఖమ్మం చేరుకున్నాయి. పార్ట్ 1కు సంబంధించి ఇంకా 2,37,280 పుస్తకాలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లతో పాటు కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, గురుకులాలు.. తదితర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ప్రతియేటా ప్రభుత్వమే ఉచితంగా బుక్స్ అందిస్తోంది. అయితే గతంలో స్కూళ్ల తరగతులు ప్రారంభమయ్యాక కూడా వంద శాతం బుక్స్ అందించేందుకు నెలల తరబడి ఆలస్యమయ్యేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా అన్ని స్కూళ్ల విద్యార్థులకు తరగతుల ప్రారంభం రోజే బుక్స్ అందించేలా ప్లాన్ చేశారు.
తొలిరోజే కొత్త యూనిఫాం..
స్కూళ్ల రీ ఓపెనింగ్ రోజే స్టూడెంట్స్‌కు కొత్త యూనిఫాం అందించేలా పనులు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,323 స్కూళ్లలో 62,532 మంది విద్యార్థులకు 2.50 లక్షల మీటర్ల క్లాత్ అవసరం ఉంది. ఇప్పటి వరకు 29,850 మంది బాలురు, 32,682 బాలికలకు అవసరమైన మొదటి జత క్లాత్ వచ్చింది.
కుట్టడం కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఖమ్మం జిల్లాలో 1,269 స్కూళ్లలో చదువుతున్న 69,241 మంది విద్యార్థులకు 2,95,420 మీటర్ల క్లాత్ అవసరం ఉంది. మొదటి జతకు అవసరమైన క్లాత్ రాగా, మరో వారం రోజుల్లో కుట్టడం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి వచ్చిన క్లాత్‌ను మండలాల వారీగా మహిళా సంఘాలకు అందజేశారు. కుట్టినందుకు మహిళా సంఘాలకు జతకు రూ.70 చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది.
కచ్చితమైన కొలతలతో కుట్టిస్తున్నాం
ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికీ కచ్చితమైన కొలతలతో యూనిఫాం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఒక్కో విద్యార్థికి ఒక జతకు సరిపోయే క్లాత్ మాత్రమే వచ్చింది. మరో వారం రోజుల్లో స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది. మిగిలిన క్లాత్ వస్తే స్కూళ్లు ప్రారంభమయ్యే లోగా రెండు జతలను విద్యార్థులకు అందజేస్తాం. బుక్స్ కూడా స్కూల్స్ రీ ఓపెనింగ్ రోజే అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.– రాజశేఖర్, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ (సీఎంఓ), ఖమ్మం