
హైదరాబాద్: పవర్లూమ్వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. సిరిసిల్ల పవర్లూమ్ఇండస్ట్రీపై ఆయన ట్వీట్చేశారు. ‘గత పదేండ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందింది. నేతన్నల జీవితాలు మెరుగుపడటమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణం.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలి. ఇండస్ట్రీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్తుంది’ అని కేటీఆర్ఆవేదన వ్యక్తంచేశారు.