కరోనా వ్యాక్సిన్ల కొనుగోలును కొంత కాలం నిలిపివేయనున్న కేంద్రం

కరోనా వ్యాక్సిన్ల కొనుగోలును కొంత కాలం నిలిపివేయనున్న కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ల కొనుగోలును కేంద్ర ప్రభుత్వం కొంత కాలం నిలిపివేయనుంది. బడ్జెట్​లో వ్యాక్సిన్ల కోసం కేటాయించిన రూ.4,237 కోట్లను సరెండర్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్​లో వ్యాక్సిన్ల కోసం కేటాయించిన మొత్తంలో ఇది 85 శాతమని కేంద్ర వైద్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటికే కేంద్రం, రాష్ట్రాల వద్ద కలిపి 1.8 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఆరు నెలలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ కు ఈ డోసులు సరిపోతాయని ఆ శాఖ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా చాలా మంది వ్యాక్సిన్లు వేయించుకున్నారని, కరోనా కేసులు తగ్గుతుండడంతో ప్రస్తుతం వ్యాక్సిన్లు తీసుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో టీకాల కొనుగోలు ప్రక్రియను కొంతకాలం ఆపివేయాలని నిర్ణయించామని ఆ వర్గాలు వెల్లడించాయి.

ప్రభుత్వాల వద్ద టీకా డోసులు అయిపోయినా మార్కెట్ లో కరోనా వ్యాక్సిన్లు దొరుకుతాయని తెలిపాయి. ‘‘ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ఎక్స్ పైరీ డేట్ దగ్గర పడుతుండడంతో కొత్తగా టీకాల సేకరణ చేయకూడదని నిర్ణయించాం. కేంద్ర ఆర్థిక శాఖకు వైద్య శాఖ రూ.4,237 కోట్లు సరెండర్ చేసింది. వ్యాక్సిన్ల సేకరణకు బడ్జెట్ లో ప్రభుత్వం రూ.ఐదు వేల కోట్లు కేటాయించింది” అని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కాగా దేశవ్యాప్తంగా నిర్వహించిన వ్యాక్సినేషన్ డ్రైవ్ లో టీకాలు వేసుకున్న వారి సంఖ్య ఆదివారం రాత్రి ఏడు గంటల నాటికి 219.32 కోట్లు దాటిందని అధికారులు చెప్పారు. పెద్దవారిలో 98 శాతం కనీసం ఒక డోసు వేసుకున్నారని, 92 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని ఆఫీసర్లు తెలిపారు.