షేడ్ నెట్ హౌస్ లకు సబ్సిడీ..ఎండాకాలంలో కూరగాయల కొరత ..నివారణకు ప్రభుత్వం చర్యలు

షేడ్ నెట్ హౌస్ లకు సబ్సిడీ..ఎండాకాలంలో కూరగాయల కొరత ..నివారణకు ప్రభుత్వం చర్యలు

మెదక్, వెలుగు:  ఎండాకాలంలో కూరగాయలకు తీవ్ర కొరత ఉంటుంది. పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్లు కూడా ఆ సమయంలోనే ఎక్కువగా ఉండడంవల్ల డిమాండ్​బాగా పెరుగుతుంది. దాంతో స్థానికంగా కూరగాయలు దొరక్క ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంవల్ల రేట్లు చుక్కలనంటుతుంటాయి. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో కూరగాయల కొరతను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూరగాయల సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. 

జిల్లాలో తూప్రాన్, చేగుంట, రామాయంపేట, శివ్వంపేట, కౌడిపల్లి, మెదక్, హవేలి ఘనపూర్ తదితర మండలాల్లో కూరగాయ పంటలు ఎక్కువగా సాగవుతాయి. జిల్లాలో దాదాపు 1,300 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగవుతున్నాయి. కాగా ఎండాకాలంలో 38 – 39 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే కూరగాయ తోటల్లో చెట్ల నుంచి దాదాపు 70 శాతం పూత రాలిపోతుంది. కాగా ప్రతి ఏటా గరిష్ట ఉష్ణోగ్రతలు 45 సెల్సియస్ డిగ్రీల వరకు పెరుగుతున్నాయి. దీనివల్ల పూతంతా రాలిపోయి కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. కూరగాయ తోటలపై షేడ్ నెట్ హౌస్ ఏర్పాటు చేసుకుంటే ఉష్ణోగ్రతను 8 డిగ్రీల వరకు తగ్గిస్తుంది. తద్వారా పూత రాలకుండా ఉంటుంది. దీంతో మే, జూన్ నెలల్లో పుష్కలంగా పంట దిగుబడి వస్తుంది. 

రూ.3.75 లక్షల సబ్సిడీ

మెదక్ జిల్లాకు 20 షేడ్ నెట్ హౌస్ లు మంజూరయ్యాయి. వీటిలో ఎస్టీలకు 2, ఎస్సీలకు 3, జనరల్ కేటగిరీ వారికి 15 కేటాయించారు. 12 గుంటల విస్తీర్ణంలో షేట్ నెట్ హౌజ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీని యూనిట్ కాస్ట్ రూ.5 లక్షలు. మొదట రైతు స్వంతంగా షేడ్ నెట్​హౌస్ ఏర్పాటు చేసుకోవాలి. హార్టికల్చర్ ఆఫీసర్లు ఇన్​స్పెక్షన్ చేసి 75 శాతం సబ్సిడీ కింద రూ.3.75 లక్షలు సంబంధిత రైతు బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు. 

జిల్లాలో ఇప్పటి వరకు 8 మంది రైతులను గుర్తించి వారికి షేడ్ నెట్ హౌజ్ ఏర్పాటు చేసుకోవడంపై హార్టికల్చర్ ఆఫీసర్లు శిక్షణ ఇస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్ సూచించారు. 

ఏ రకమైన కూరగాయలైనా..

షేడ్ నెట్ హౌజ్ లో అన్ని రకాల ఆకుకూరలు, క్యాప్సికం, టమాటో, వంకాయ, బీర, సోర, కాకర వంటివి సాగు చేసుకోవచ్చు. షేడ్ నెట్ హౌజ్ విధానం వల్ల మొక్కలు బాగా ఎదిగి మంచి పంట దిగుబడి వస్తుంది. తద్వారా రైతుకు లాభదాయకంగా ఉంటుంది.