సబ్సిడీ ట్రాక్టర్లు తీసుకుని.. దర్జాగా అమ్ముకున్నారు

సబ్సిడీ ట్రాక్టర్లు తీసుకుని.. దర్జాగా అమ్ముకున్నారు

గవర్నమెంట్ రూల్స్ పట్టించుకోని టీఆర్ఎస్ లీడర్లు

70 శాతం మంది లీడర్ల ఇండ్లలో కనిపించని ట్రాక్టర్లు

రూ.20 కోట్ల ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం

టీఆర్​ఎస్​ ఫస్ట్ గవర్నమెంట్ లో ఉమ్మడి జిల్లాలో 562 ట్రాక్టర్ల పంపిణీ

ఎన్‌వోసీల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న కొనుగోలు దారులు

‘‘ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి, రెండో దశల్లో కలిపి మొత్తం 32 ట్రాక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం రూ.1.13 కోట్ల రాయితీపై పంపిణీ చేసింది. వీటిలో మంగపేట, గోవిందరావుపేట, కొత్తగూడలో ముగ్గురికి మినహా మిగతా 29 ట్రాక్టర్లను అప్పటి టీఆర్‌ఎస్‌ లీడర్లే తీసుకున్నారు. అప్పటి ములుగు ఎమ్మెల్యే, మంత్రి అజ్మీరా చందూలాల్‌‌‌‌ఆదేశాలతో అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి లీడర్లకు అగ్రికల్చర్​ ఆఫీసర్లు ఈ రాయితీ ట్రాక్టర్లు అందించారు. నియోజకవర్గంలో ట్రాక్టర్లు తీసుకున్న వారిలో ప్రస్తుతం 25 మంది దగ్గర అవి లేనేలేవు. వారంతా రూ.3 లక్షల లోపు పైసలు తీసుకొని వేరేవాళ్లకు అమ్మేసుకున్నారు.’’

‘‘భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో మూడు విడతల్లో కలిపి 26 మందికి ప్రభుత్వ రాయితీ ట్రాక్టర్లు అందించారు. టీఆర్‌ ఎస్‌ కు చెందిన అప్పటి ఏడుగురు సర్పంచ్‌ లు, ముగ్గురు ఎంపీటీసీలు, అప్పటి టీఆర్‌ఎస్‌ నాయకులైన ప్రస్తుత ఇద్దరు సర్పంచ్‌ లు, ఇద్దరు ఎంపీటీసీలతో పాటు మిగతా టీఆర్‌ ఎస్‌ జిల్లా, మండల స్థాయి లీడర్లు కలిసి రూ.కోటి వరకు ప్రభుత్వ సొమ్మును నొక్కేశారు. ట్రాక్టర్ల కోసం తమ పార్టీ నేతలంతా పోటీపడడంతో అప్పటి స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి మరీ ఈ మండలానికి ఎక్కువ ట్రాక్టర్లు తీసుకొచ్చారు. ఇలా ట్రాక్టర్లు పొందిన వారిలో 10 మంది తమ ట్రాక్టర్లను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు’’

జయశంకర్‌ భూపాలపల్లి, వెలుగు: ఉమ్మడి జిల్లా లో టీఆర్‌ఎస్‌ ఫస్ట్‌ గవర్నమెంట్‌ లో 2015 నుంచి 2017 మధ్య కాలంలో మూడు విడతల్లో సుమారు రూ.30 కోట్ల ప్రభుత్వ సబ్సిడీ (రాయితీ)పై 562 ట్రాక్టర్లను పంపిణీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం, ఇతర వర్గాల వారికి 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను ఇచ్చింది. మూడేళ్లు డీ ట్రాక్టర్లు తీసుకున్నవారిలో 70 శాతం మంది తమ ట్రాక్టర్లను వేరే వాళ్లకు అమ్మేశారు. దీంతో రూ.20 కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైంది. అప్పుడే అర్హులైన వారికి అందించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని ప్రజలు అంటున్నారు.

అప్పటి ఎమ్మెల్యేల సిఫారసు

పేద రైతులకు అండగా నిలబడటానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఓసీ, బీసీలకు ఒక్కో ట్రాక్టర్‌ పై రూ.3.5 లక్షల వరకు రాయితీ ఇవ్వగా, ఎస్సీ, బీసీలకు రూ.5 లక్షలకు మించి అందించింది.దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించడానికి మండల, జిల్లా స్థా యిలో కమిటీలను వేసింది.మండల స్థాయిలో ఎంపీపీ అధ్యక్షతన తహసీల్దార్‌, ఎంపీడీవో, వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన లబ్ధిదారులను గుర్తించి కమిటీ ఆమోదం తెలపాలి. అయితే మండల కమిటీలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల జోక్యం పెరిగి అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్‌ ఎస్‌ నియోజకవర్గ ఇన్చార్జిలు ఎవరిని సూచిస్తే వారికే ట్రాక్టర్లను అందించారు. అర్హత కలిగిన చాలా మంది రైతులు ట్రాక్టర్ల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నా వ్యవసాయ శాఖ ఆఫీసర్లు పట్టించుకోలేదు. కొన్నవారు ఎన్‌వోసీల కోసం తిరుగుతున్నరు సబ్సిడీ ట్రాక్టర్లకు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, హెచ్‌ డీఎఫ్‌సీ , మహీంద్రా బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. స్వరాజ్‌ , మహింద్ర, జాన్‌‌‌‌డీర్‌ కంపెనీలకు చెందిన ట్రాక్టర్లను అందించారు. వ్యవసాయ శాఖ పంపిన ప్రొసీడింగ్‌ లో ఉన్న పేర్ల ఆధారంగా ట్రాక్టర్లను ఇచ్చారు. ఒక కిస్తీకి రూ.35 వేల నుంచి రూ.50 వేల చొప్పున ఏడాదికి రెండు, మూడేళ్లలో 6 కిస్తీలు చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నారు. తీరా మధ్యలోనే ట్రాక్టర్లను కొన్న వాళ్లంతా ఆర్‌టీవో ఆఫీసులో పేరు మార్పిడి, ఎన్‌‌‌‌వోసీల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.ఎన్‌‌‌‌వోసీలు ఇవ్వకుండా ఆరేళ్ల రూల్ ఉండడంతో బ్యాంకులు కొనుగోలు దారులకు ఇవ్వడం లేదు.

రూల్స్ దాటిన్రు..

ప్రభుత్వ సబ్సిడీపై పొందిన ట్రాక్టర్‌ ను అమ్ముకోవడం రూల్స్​ దాటడమే. సుమారు 6 ఏండ్ల పాటు పేపర్లు వేరే వ్యక్తుల పేర్లపై మార్పు చేయడం కుదరదు. 95 శాతం సబ్సిడీ గల ఎస్సీ, ఎస్టీలను ముందుగానే గుర్తించిన కొందరు లీడర్లు వాళ్లకు ముందుగానే డబ్బులు ముట్టచెప్పి వాళ్ల పేర్లపై ట్రాక్టర్లు తీసుకున్నారు. బీసీ, ఓసీ లీడర్లు అయితే ట్రాక్టర్లు వచ్చిన నెల, రెండు నెలల్లోనే రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు ధర మాట్లాడుకుని వేరే వాళ్లకు దర్జాగా అమ్ముకున్నారు.