న్యూ ఇయర్​కు సర్కార్​ టార్గెట్ వెయ్యి కోట్లు

న్యూ ఇయర్​కు సర్కార్​ టార్గెట్ వెయ్యి కోట్లు
  • సర్కార్​ టార్గెట్ వెయ్యి కోట్లు
  • కిందటేడాది రికార్డు బ్రేక్ చేసేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు 
  • పోయినేడాది వేడుకల టైమ్ లో రూ.759 కోట్ల అమ్మకాలు 
  • జిల్లాల్లోని డిపోల్లోకి భారీగా కొత్త స్టాక్ 

వరంగల్‍, వెలుగు: ఈసారి ఇయర్‍ ఎండ్‍, న్యూ ఇయర్‍ వేడుకల టైమ్ లో జనాలతో బగ్గ తాగించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. పోయినేడాది కన్నా 15 నుంచి 20 శాతం సేల్స్​పెంచాలని ఎక్సైజ్​శాఖకు టార్గెట్ పెట్టింది. ఈసారి సెలబ్రేషన్స్ టైమ్ లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.వెయ్యి కోట్ల వరకు రాబట్టుకునేందుకు ప్లాన్ చేసింది. పోయినేడాది కరోనా ఉన్నప్పటికీ ఒక్క డిసెంబర్​లోనే రికార్డు స్థాయిలో రూ.2,765.6 కోట్ల లిక్కర్​సేల్ అయింది. ఈసారి వైన్స్, బార్ల సంఖ్య పెరగడంతో ఆ రికార్డును బ్రేక్ చేయాలని చూస్తోంది. సర్కార్ ఆదేశాలతో ఆబ్కారీ ఆఫీసర్లు అందుకు తగ్గట్టు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రతి షాపుకు టార్గెట్ ఫిక్స్​చేస్తున్నారు. బెల్టు షాపులకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు.

కిందటేడాది డిసెంబర్ లో ఆల్‍ టైమ్ రికార్డ్.. ​ 
రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతేడాది డిసెంబర్ లో లిక్కర్‍ సేల్స్​ఆల్​టైమ్ రికార్డ్ నెలకొల్పాయి. 2019 డిసెంబర్‍లో రాష్ట్రంలోని 2,216 వైన్స్​లు, వెయ్యి బార్లు, క్లబ్బుల్లో రూ.2,046 కోట్ల సేల్స్ జరిగాయి. ఆ తర్వాత 2020 అక్టోబర్​లో దసరా నేపథ్యంలో సేల్స్ రూ.2,623 కోట్లకు చేరాయి. అదే ఏడాది డిసెంబర్‍లో రూ.2,765.6 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇదే ఇప్పటివరకు ఆల్​టైమ్​రికార్డ్. అప్పుడు న్యూఇయర్ వేడుకల టైమ్ లో డిసెంబర్ చివరి నాలుగు రోజుల్లోనే రూ.759 కోట్ల సేల్స్ జరిగాయి. డిసెంబర్ లో మొత్తం 34 లక్షల కేసుల ఇండియన్‍ మేడ్‍ లిక్కర్‍, 27 లక్షల కేసుల బీర్లు సేల్ కాగా.. ఒక్క డిసెంబర్​31నే 2.2 లక్షల కేసుల లిక్కర్, 1.6 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అదే జోష్‍లో ఈ ఏడాది జనవరిలోనూ రూ.2,633 కోట్ల లిక్కర్‍ అమ్మకాలు జరిగాయి.

షాప్స్​ పెరిగినయ్.. సేల్స్ పెంచాలె 
రాష్ట్రంలో 2019–21లో 2,216 వైన్‍ షాపులకు లైసెన్సులు ఇచ్చిన సర్కార్... 2021–23కు గాను అదనంగా 404 షాపులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో షాపుల సంఖ్య 2,620కి పెరిగింది. అంతకుముందే కొత్తగా159 బార్లకు ప్రభుత్వం పర్మిషన్‍ ఇచ్చింది. కొత్త లిక్కర్​పాలసీ కింద కొత్త షాపులు కూడా ఈ నెల 1 నుంచే ప్రారంభమయ్యాయి. గతంలో రూ.50 లక్షల ఫీజు ఉన్న షాపులో రూ.3.50 కోట్ల వరకు సేల్స్ జరిగితే 20 శాతం మార్జిన్ వచ్చేది. ఆపై సేల్స్ కు 6.4 శాతం మార్జిన్ మాత్రమే ఉండేది. ప్రస్తుత పాలసీలో మార్పులు చేశారు. రూ.5 కోట్ల సేల్స్​వరకు 20 శాతం మార్జిన్ ఇస్తున్నారు. ఆపై సేల్స్ జరిగితే 10 శాతం మార్జిన్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. దీంతో లిక్కర్​వ్యాపారులు మరింత ఉత్సాహంగా సేల్స్​పెంచాలనే ఆసక్తితో ఉన్నారు. ఇందుకు ఆబ్కారీ శాఖ కూడా తన వంతు ప్రోత్సాహం అందిస్తోంది. గతేడాది డిసెంబర్​కంటే ప్రతిషాపునకూ 15 నుంచి 20శాతం టార్గెట్లు పెట్టడమే కాకుండా.. వాటి పరిధిలోని బెల్టు షాపుల విషయంలో ఆఫీసర్లు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద డిసెంబర్​చివరి నాలుగు రోజుల్లో స్టేట్​వైడ్ గా రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1200 కోట్లు రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఆఫర్లు ఇస్తున్న కంపెనీలు... 
ఈసారి లిక్కర్ సేల్స్ బాగా పెరిగే చాన్స్​ఉండడంతో తమ బ్రాండ్​లను ప్రమోట్​చేసుకునేందుకు వివిధ బీరు, బ్రాండీ, విస్కీ కంపెనీలు తమ సేల్స్​టీమ్స్ ను ఇప్పటికే రంగంలోకి దింపాయి. వారు జిల్లాల్లో ఉన్న లిక్కర్​వ్యాపారులను కలిసి కంపెనీ నుంచి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తమ బ్రాండ్ల సేల్స్​పెంచితే అడిషనల్​మార్జిన్​తో పాటు స్పెషల్​గిఫ్ట్​లు ఇస్తామంటున్నారు. కరోనా ప్రభావం తగ్గితే బ్యాంకాక్‍, సింగపూర్‍, థాయిలాండ్‍ ట్రిప్‍ ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్​చేస్తున్నారు. అమ్మకాలు బాగానే ఉంటాయన్న ఆశతో ఓనర్లు కూడా ఎక్కువ స్టాక్​తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. దీంతో జిల్లా కేంద్రాల్లోని ఐఎంఎల్‍ గోడౌన్లు అడిషనల్‍ స్టాక్‍తో కళకళలాడుతున్నాయి.

సర్కారుకు లిక్కర్ ఆదాయమే పెద్ద దిక్కు.. 
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్ర సర్కారుకు లిక్కర్​ ఆదాయమే పెద్ద దిక్కుగా మారింది. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో 2014-15లో లిక్కర్​ ఆదాయం రూ.10,880 కోట్లు, 2020-21లో రూ. 27,280 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఏకంగా రూ.30 వేల కోట్లు రాబట్టాలని ఎక్సైజ్ ​శాఖకు సర్కార్ టార్గెట్​ పెట్టింది. ఈ క్రమంలోనే కొత్తగా 404 లిక్కర్​షాపులు, 159 బార్లకు పర్మిషన్ ఇచ్చి.. ఆబ్కారీ శాఖ అధికారులపై ఒత్తిడి పెంచింది. దీంతో ఎలాగైనా లక్ష్యం చేరుకోవాలని భావిస్తున్న ఎక్సైజ్ ఆఫీసర్లు... ఏ పండగ వచ్చినా వదలకుండా లిక్కర్​ అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. వాడవాడలా బెల్టుషాపులు తెరుస్తున్నా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. జనాన్ని బాగా తాగిస్తూ సర్కారు గల్లా పెట్టె నింపుతున్నారు.