పీవీ ప్రారంభించిన ఇనిస్టిట్యూట్‌కు 25ఏండ్లు అయినా జాగా ఇవ్వని సర్కార్

పీవీ ప్రారంభించిన ఇనిస్టిట్యూట్‌కు 25ఏండ్లు అయినా జాగా ఇవ్వని సర్కార్
  • 25 ఏండ్లు అయినా పీవీ కల నెరవేరలే
  • పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
  • హైదరాబాద్ లో నేషనల్ రూరల్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించిన అప్పటి ప్రధాని పీవీ 

హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 25 ఏండ్ల కిందట ప్రారంభించిన మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇనిస్టిట్యూట్(ఎంజీఎన్సీఆర్ఐ)కు హైదరాబాద్‌లో జాగా కరువైంది. దేశంలోని గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పన, మానవ వనరుల వినియోగం, స్కిల్ డెవలప్ మెంట్ అంశాలపై రీసెర్చ్, ప్రత్యేక కోర్సులు, లెసన్స్ రూపకల్పన కోసం తెచ్చిన ఈ ఇనిస్టిట్యూట్ భవిష్యత్తులో ఒక రూరల్ యూనివర్సిటీగా విస్తరిస్తుందన్న పీవీ కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. ఇనిస్టిట్యూట్ కోసం సొంత బిల్డింగులు కట్టేందుకు రాజేంద్రనగర్ లో స్థలం కేటాయించాలని ఎన్నిసార్లు కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. దీంతో నేషనల్ లెవెల్ సంస్థ.. ఇప్పటికీ కిరాయి బిల్డింగుల్లోనే నడుస్తోంది. ఒకవైపు పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆయన ఆశయాలను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.   

1995లో ప్రారంభించిన పీవీ 
కేంద్ర హెచ్ఆర్డీ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఎన్సీఆర్ఐను1995లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు హైదరాబాద్ లో ప్రారంభించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ తో గ్రామీణ వ్యవస్థను కనెక్ట్ చేయడం, ఇందుకు అవసరమైన సిలబస్, కరికులమ్ రూపొందించడం, కోర్సులు నిర్వహించడం, గ్రామీణాభివృద్ధికి పాలసీలు రూపొందించడం అనే ప్రధాన లక్ష్యాలతో ఈ సంస్థ ముందుకు సాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో పల్లెల సమస్యలపై పరిశోధనలు చేస్తున్న స్కాలర్స్కు స్కాలర్షిప్ లు కూడా ఇస్తోంది. ఇందులో 30 శాతం స్లాట్స్ తెలంగాణ వారికే మంజూరు చేస్తున్నారు. మహాత్మాగాంధీ150వ జయంతి వేడుకల సందర్భంగా ఈ సంస్థ పేరును 2018లో ఎంజీఎన్సీఆర్ఐ గా మార్చారు. ఈ సంస్థ భవిష్యత్ లో రూరల్ యూనివర్సిటీగా మారుతుందని అప్పట్లో పీవీ ఆకాంక్షించారు.   
గుంట జాగా కూడా ఇయ్యలే 
మహాత్మా గాంధీ రూరల్ ఇనిస్టిట్యూట్ ప్రస్తుతం అసెంబ్లీ ఎదురుగా ఉన్న షక్కర్భవన్లో కొనసాగుతోంది. విశాలమైన క్యాంపస్ లో నిర్వహించాల్సిన ఇనిస్టిట్యూట్ ను అద్దె భవనంతో నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం మూడేళ్ల క్రితం బిల్డింగ్స్నిర్మాణం కోసం రూ.10 కోట్లు కేటాయించింది. రాజేంద్రనగర్ లోని ఎన్ఐఆర్డీ, టీఎస్ఐపీఆర్డీ క్యాంపస్ లలో లేదా ఆచార్య జయశంకర్అగ్రికల్చర్వర్సిటీ క్యాంపస్ లో ఎకరం స్థలం కేటాయించాలని ఎంజీఎన్సీఆర్ఐ చైర్మన్, మెంబర్సెక్రటరీలు మూడేళ్లలో ప్రభుత్వానికి10 సార్లకుపైగా లెటర్లు రాశారు. 2018లో అప్పటి అగ్రికల్చర్మినిస్టర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి, పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, నాటి ఎంపీ కవితకు కూడా లేఖలు రాశారు. సంస్థను ప్రారంభించడం వెనక ఉన్న పీవీ ఆశయాలను వివరించారు. అయినా ఇప్పటిదాకా ప్రభుత్వం గుంట స్థలం కూడా కేటాయించలేదు. 
నవోదయలో స్థలం ఇచ్చిన కేంద్రం  
రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడం, రెండేళ్లు దాటిపోవడంతో రూ.10 కోట్ల నిధులు ల్యాప్స్అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో తమకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడం లేదని, ఏదో ఒక విధంగా మీరే స్థలం కేటాయించాలని సెంట్రల్ హెచ్ఆర్డీ మినిస్టర్రమేష్ పోఖ్రియాల్ ను సంస్థ నిర్వాహకులు కోరారు. దీంతో తన మినిస్ట్రీ పరిధిలోని జవహర్ నవోదయ విద్యాలయ (హెచ్సీయూ–గోపనపల్లి)లో అర ఎకరం కేటాంచారు. ఇందులోనే మూడు ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మాణం ప్రారంభించారు. 
పీవీ ఆశయ సాధనే నిజమైన నివాళి  
రాష్ట్ర ప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించి చేతులు దులుపుకోవడం సరికాదు. ఆయన ఆశయాలను కూడా కొనసాగించాలి. మహాత్మా గాంధీ రూరల్ ఇనిస్టిట్యూట్.. రూరల్ యూనివర్సిటీ స్థాయికి విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఈ ఇనిస్టిట్యూట్ ను అభివృద్ధి చేస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఇదే పీవీకి నిజమైన నివాళి అవుతుంది. -మురళీ మనోహర్, మాజీ మెంబర్ సెక్రటరీ, ఎంజీఎన్సీఆర్ఐ.