భూములిచ్చినా నీళ్లు వస్తలే..

భూములిచ్చినా నీళ్లు వస్తలే..
  • లింక్​ కాల్వ పేరిట మరోసారి భూసేకరణ ప్రయత్నాలు
  • సర్వేలను అడ్డుకుంటున్న రైతులు
  • ఇప్పటికే 4 సార్లు ఇచ్చినం.. 
  • ఇక గుంట భూమి కూడా ఇచ్చేదిలేదంటున్రు 

కరీంనగర్/చొప్పదండి, వెలుగు: చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల మీదుగా అన్ని  ప్రాజెక్టుల  కాలువలు పోతున్నాయి. ఆ ప్రాజెక్టులకు భూములు ఇచ్చింది కూడా ఇక్కడి రైతులే..  అయినా.. ఈమూడు మండలాలకు చెందిన రైతుల పొలాలకు మాత్రం  నీళ్లు అందడంలేదు. ఇప్పటికే వరదకాలువ, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తాగునీటి పైపు లైన్ కోసం ఇక్కడి రైతులు భూములిచ్చారు. ఆ తరవాత కాళేశ్వరంలో భాగమైన లక్ష్మీపూర్ ప్రాజెక్టు కోసం వందల ఎకరాలు ఇచ్చారు. కాకతీయ కాలువ కోసం గతంలో పెద్ద ఎత్తున భూములు తీసుకున్నారు.  కాళేశ్వరం  ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టనున్న మోతె లింక్ కెనాల్ కోసం మళ్లీ భూసేరకణ ప్రారంభించారు. దీంతో  ఆయా మండలాలకు చెందిన రైతులు తమ భూముల్లోంచి ఇక కాలువలు నిర్మించొద్దని.. తమకు ఈ మాత్రం పొలాలనైనా మిగల్చాలని కోరుతున్నారు. సర్వే కోసం వచ్చిన అధికారులను ఆప్పటికే గ్రామాల్లో అడ్డుకున్నారు. సోమవారం కలెక్టరేట్ దగ్గర ధర్నా చేపట్టారు. ఈసారి గుంట భూమి తీసుకున్నా ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. 
అడుగుడుగునా అడ్డంకులే
గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లోని మెట్ట ప్రాంతానికి నీళ్లిచ్చేందుకు మోతె  లింక్ కెనాల్ నిర్మిస్తున్నారు. ఈ పనుల కోసం భూసేకరణ చేసేందుకు వెళ్లిన ఆఫీసర్లను అడుగడుగునా రైతులు అడ్డుకుంటున్నారు. రామడుగు మండలం గుండి, లక్ష్మీపూర్ గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆఫీసర్లను నిలదీశారు.  కాకతీయ, వరదకాలువ, ఎల్లంపల్లి, కాళేశ్వరం, నారాయణపూర్  ప్రాజెక్ట్ ల కోసం ఇప్పటికే తాము  భూములు ఇచ్చామని, ఈ ప్రాంతంలో ఐదారు సాగునీటి కాల్వలున్నా మండలం  ఎడారిలాగే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోతె లింక్ కెనాల్​కోసం సేకరించాలని చూస్తున్న భూములు చాలా విలువైనవని, వ్యాపార అవసరాలకు పనికొస్తాయని తామే గుంటకు రూ. లక్షలు పెట్టి కొన్నామని వారు చెప్తున్నారు.  ఈ భూములను వదులుకొనేదిలేదంటూ రైతులు గుండి, లక్ష్మీపూర్​లలో గ్రామసభకు వచ్చిన ఆఫీసర్లను గ్రామ పంచాయతీలో నిర్బంధించారు. రైతుల నిరసనలతో వారు తిరిగివెళ్లిపోయారు. భూములిస్తే మండలం సస్యశ్యామలమవుతుందని ఆఫీసర్లు చెప్పారని, కానీ కాల్వల్లో నీళ్లు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. లీడర్లు కూడా తమ గోస పట్టించుకోలేదన్నారు.  
తమ మేలు కోసం కాల్వలు నిర్మిస్తున్నామన్న లీడర్ల మాటలను రైతులు నమ్మడంలేదు. కమీషన్ల కోసమే కాలువ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో నారాయణపూర్ కాలువ నిర్మాణానికి భూములిచ్చామని, ఆ కాల్వ  నిర్మాణాన్ని మధ్యలో వదిలేశారంటున్నారు. ఇప్పుడు లింక్​ కాల్వ పేర మళ్లీ భూములు ఇవ్వాలనడం సమంజసం కాదంటున్నారు. 

అందరూ పేద రైతులే
మూడు మండలాలకు నీళ్లు అందించేందుకు నిర్మించనున్న మోతె లింక్ కెనాల్ కోసం గంగాధర మండలం సర్వారెడ్డిపల్లిలో  29.21 ఎకరాలు, రామడుగు మండలం చిప్పకుర్తిలో  47.03 ఎకరాలు, గుండిలో 47.23 ఎకరాలు, లక్ష్మీపూర్​లో  10.14 ఎకరాలు, చొప్పదండి మండలం రాగంపేటలో 30.23 ఎకరాల చొప్పున  మొత్తం 165.03 ఎకరాలు సేకరించనున్నారు. ఇవన్ని ఎకరం, అరెకరం ఉన్న 200 మంది చిన్న, సన్నకారు రైతులకు చెందిన భూములే. ఈ భూములు పోతే వారి బతుకుదెరువుకు మరో మార్గంలేదు. 

కొత్త కాలువల వల్ల  ప్రయోజనం శూన్యం
 ఇక్కడ ఇప్పటికే ఎల్లంపల్లి పైపులైన్, వరద కాలువలతో మా పొలాలు జాలు పడుతున్నాయి. మళ్లీ కెనాల్​ ఎందుకు.. ఈ కాలువ నిర్మిస్తే మా భూమి  3 ఎకరాలు పోతది. భూసేకరణ నిలిపి వేయకుంటే  అందరం కలిసి  ఆందోళన చేస్తాం.
– ఐలినేని సాయిరాం, సర్వరెడ్డిపల్లి, గంగాధర మండలం

రెండున్నర ఎకరాలు పోతున్నయి 
నాకు పావుతక్కువ మూడు ఎకరాలు ఉండగా.. రెండున్నర ఎకరాలు ఈ క్వాలకింద కోల్పోవాల్సి వస్తుంది. ఈ భూమి దగ్గర ఇండ్లు కడుతున్నారు. గుంటకు రూ. 2 నుంచి 3లక్షల రేటు ఉంది. కాల్వ తోని మాకు ఏం లాభంలేదు కానీ మా కుటుంబాలను రోడ్డున పడతాయి. 
–  కత్తి రవి, గుండి గ్రామం, రామడుగు మండలం