భారతదేశం ఆధునికత వైపు పరుగులు తీస్తున్నట్లు కనిపించినా, కులం అనే చారిత్రక దుర్విచక్షణ ఇప్పటికీ వదలడం లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యనే ఇందుకు నిదర్శనం. ఆయన మరణించి పదేళ్లయిన సందర్భంగా ఇటీవల 2026 జనవరి 17న యూనివర్సిటీ ప్రాంగణంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురుసామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, ప్రొఫెసర్లు హాజరయ్యారు. ఈ సభలో ఓ వక్త ప్రసంగిస్తూ రోహిత్ వేముల పరాజితుడా? విజేతనా? అనే ప్రశ్నతో ఉపన్యాసాన్ని ప్రారంభించాడు. ఆయన మాటలు పలువురిని ఆలోచింపచేశాయి.
ఆయనే బహుజన రాజకీయాలపై పరిశోధించి(పీహెచ్డీ చేసి) సమాజాన్ని మార్చడానికి బయలుదేరిన వ్యక్తి డాక్టర్ విశారదన్ మహరాజ్. వేల సంవత్సరాలుగా సమాజంలో అస్పృశ్యత అంటరానితనంతో బాధపడుతున్న దళితులకు భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఉన్నత విద్యనభ్యసించే అవకాశం కల్పించాయి. కానీ, అక్కడ కొనసాగుతున్న సంస్థాగత కులరక్కసి రోహిత్ వేములను బలిగొన్నది. ఆయన మరణం దేశ, విదేశ విద్యాసంస్థలలో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అసలు ఈ దేశంలో క్యాన్సర్ తో బతకచ్చేమో కానీ కులంతో బతకలేమని క్షేత్రస్థాయి వాస్తవాలు సైతం రుజువు చేస్తున్నాయి.
ఉన్నత విద్యాసంస్థల్లో కులవివక్ష
మేధావులను పుట్టించి, దేశ అభివృద్ధికి బీజం వేయాల్సిన ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష కొనసాగడం శోచనీయం. గత ఐదేండ్ల కాలంలో దేశంలోని యూనివర్సిటీలో, కళాశాలల్లో కులవివక్షత ఆధారిత ఫిర్యాదులు 118.4 శాతం పెరిగినట్లు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ)డేటా స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల యూజీసి ఉన్నత విద్యా సంస్థల్లో సమతా సమితులు (Equity Committees) ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. మతం, జాతి, కులం, లింగం ఆధారిత వివక్ష ఫిర్యాదులను నివారించడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. రోహిత్ వేముల మరణాంతరం ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షతకు అడ్డుకట్ట వేయడానికి ‘రోహిత్ వేముల చట్టం’ తేవాలని దేశవ్యాప్తంగా చర్చ మొదలైనది. ఇది ఆచరణ దాల్చడానికి నాటి నుంచి బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఈ సమస్యపై నిలబడినప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలోనైనా చట్టం తీసుకురాలేదు. కుల వివక్షత, దాడులు ఆగడం లేదు. రోహిత్ వేముల మరణం, కారంచేడు, చుండూరు వంటి అమానవీయమైన ఘటనలు ఇందుకు నిదర్శనమే. ఫూలే, అంబేద్కర్, కాన్షీరాం
మిషన్ కొనసాగింపు ఏది?
మెజారిటీ దళిత మేధావి వర్గం తమ విముక్తికి సంబంధం లేని ఉద్యమాల్లో (ఉదా: రైతాంగ సాయుధ పోరాటం, నక్సలైట్ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, హిందీ వ్యతిరేక, నార్త్ ఇండియా వ్యతిరేక, మార్వాడీ ఉద్యమం) పాల్గొని ఫూలే, అంబేద్కర్, కాన్షీరాం మార్గాన్ని దారి తప్పిస్తున్నారు. యూనివర్సిటీల్లో కొందరు దళిత అధ్యాపక మేధావి వర్గం విద్యార్థులను చదువులకు దూరంచేసి, వామపక్షాల వైపు నడిపిస్తూ కుటుంబాలను ఆగం చేస్తున్నారు. అంబేద్కర్ను పుట్టించాల్సింది బదులు హెడ్మాలను పుట్టిస్తున్నారు.
ఇంకొంతమంది యూనివర్సిటీలో చదువుకున్న
విద్యార్థి మేధావులు పాటలు, కవిత్వం, సాహిత్యంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నుంచి ప్రయోజనాలు పొందుతున్నారు. కొంతమంది దళిత ఉద్యమకారులు గోరంత లాభానికి కొండంత జాతిని బలిచ్చి ఆ పార్టీలను అందలమెక్కిస్తున్నారు. పాలకులను సంతృప్తి పరుస్తూ పురస్కారాలను పొందుతున్నారు. ఇంకొందరు విప్లవం రావాలని కోరుకుంటారు. కానీ, పక్కింట్లో రావాలంటారు. తన భాగస్వామ్యం ఉండాలని కోరుకోరు. రోహిత్ వేములలాగ తమ పిల్లలకు సమస్య ఎదురైనప్పుడు వాళ్లకు అర్థమవుతుంది. మరికొందరు దళిత మేధావులు అంబేద్కర్ ముచ్చట్లు చెప్పుకొంటూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారు. ఏ కులం అధికారంలో ఉంటుందో ఆ కులంపైన దాడులు జరగవని కాన్షీరాం చెప్పాడు. అంబేద్కర్ అంటే హక్కుల పోరాటం కాదు, అగ్రవర్ణాలిచ్చే పదవులు, సంక్షేమ పథకాలు కాదు. ఓటనే ఆయుధంతో రాజ్యాధికార యుద్దమే. రాజ్యాధికారం అంటే అగ్రకుల పార్టీల్లో పనిచేయడం కాదు, స్వశక్తితో నడిచే బహుజన పార్టీలో పనిచేయడం. ఇప్పుడు ఆయన ఉద్యమాన్ని రిజర్వేషన్స్ ద్వారా లాభపడ్డ బుద్ధిజీవులు ముందుకు నడిపించినప్పుడే దళితులపై అఘాయిత్యాలు ఆగుతాయని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నొక్కి చెప్పిన బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ మాటలు ముమ్మాటికి అక్షర సత్యం. ఇదే రోహిత్ వేములకు నివాళి. దళిత జాతిలో పుట్టడం అంటేనే యుద్ధరంగంలో పుట్టడం. ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దు.
సమ్మక్క సారలమ్మలాగ తుదిశ్వాస వరకు దళిత జాతి కోసం పోరాడాలి.
- సంపతి రమేష్ మహారాజ్,
సోషల్ ఎనలిస్ట్
