హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ నియామకాలకు లైన్ క్లియర్ అయ్యింది. కోదండరాం, అజారుద్దీన్ శాసన మండలి అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ఈ మేరకు శనివారం (25) ఫైళ్లపై గవర్నర్ సంతం చేశారు. 2025, ఆగస్ట్ 30న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ప్రతిపాదిస్తూ రేవంత్ రెడ్డి కేబినెట్ గవర్నర్‌కు సిఫారసు చేసింది. దాదాపు 8 నెలల తర్వాత కేబినెట్ సిఫారసులకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
ఏ సభలో ప్రాతినిధ్యం లేకుండానే అజారుద్దీన్ రేవంత్ రెడ్డి కేబినెట్‍లో మంత్రి పదవి చేపట్టారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలలలోపు ఏదైనా సభకు ఎన్నిక కావడం తప్పనిసరి. 2026, ఏప్రిల్ 30తో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలులు పూర్తి అవుతోంది. ఓ వైపు గడువు ముంచుకు వస్తుంటే మరోవైపు ఎమ్మెల్సీ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అజారుద్దీన్ మంత్రి పదవిపై సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో గడువు ముగియడానికి 5 రోజుల ముందు అజారుద్దీన్ తో పాటు కోదండరాం ఎమ్మెల్సీల నియమాకాలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవిపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది.
ఎమ్మెల్సీల నియామక వివాదం ఇదీ..
గత బీఆర్ఎస్ సర్కార్ మంత్రివర్గం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించి గవర్నర్‌కు సిఫారసు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యక్తులకు రాజకీయ నేపథ్యం ఉన్నదంటూ అప్పటి గవర్నర్ తమిళిసై ఈ సిఫారసును తిరస్కరిస్తూ.. 2023, సెప్టెంబర్ 19న ఉత్తర్వులు రిలీజ్ చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాసోజు, కుర్రా వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు.
ఇదే టైంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం.. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గం 2024 జనవరి 13న కోదండరాం, ఆమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ సిఫారసు చేసింది. ఈ సిఫారసును గవర్నర్ ఆమోదించడంతో అదే ఏడాది జనవరి 27న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఇదిలా ఉండగానే.. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరువైపుల సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. గతేడాది 2025 మార్చి 17న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ నామినేషన్లను తిరసరిస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
అలాగే.. కొత్తగా ఎమ్మెల్సీగా కోదండరాం, అలీఖాన్‌ను నియమించాలనే తీర్మానంతో పాటు వాళ్లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అలీఖాన్ల పేర్లను రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సిఫారసు చేసింది. ఆ పేర్లను గవర్నర్ ఆమోదించడంతో కోదండరాం, అలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు.
గవర్నర్ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగార్చేలా ఉందంటూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ 2025 ఆగస్టు 4న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారించిన సుప్రీంకోర్టు.. తామిచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఎమ్మెల్సీల ఎంపిక ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఆ తర్వాత కోదండరాం, అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు.
మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయడాన్ని బుధవారం విచారణలో సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అందుకే గతంలోని మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఇద్దరు ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడంపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 31తో ఆరు నెలల గడువు ముగుస్తున్న క్రమంలో కొత్త గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కోర్టుకు తెలిపారు అటార్నీ జనరల్.
బుధవారం ఈ కేసును విచారించగా..కోదండరాం, అజారుద్దీన్ లపై కొత్త గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు సమయం ఇవ్వాలని అటార్నీ జనరల్ కోర్టును కోరారు. కొత్త గవర్నర్ నిర్ణయం తర్వాత విచారణ కొనసాగించాలా? ముగించాలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. తీర్పును జూలై 22 కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ క్రమంలోనే కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీ నియమాకాలకు గవర్నర్ పచ్చజెండా ఊపారు.

