- ఎడ్యుకేషన్‌పై సోషల్ రెస్పాన్సిబిలిటీ తీస్కోవాలి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా యూనివర్సిటీలు మిగిలిపోవద్దు
- టెక్నాలజీ అందిపుచ్చుకున్నవాళ్లే ప్రపంచాన్ని శాసిస్తారు
- ‘ఏఐ ఫర్ ఆల్’ అనే నినాదంతో ముందుకు సాగాలి
- ఓయూలో ఏఐయూ వైస్ చాన్స్‌లర్ల సదస్సులో స్పీచ్
హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ సంస్థలకు 'సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ)' ఉన్నట్లే, విద్యాసంస్థలకు కూడా ‘ఈఎస్ఆర్(ఎడ్యుకేషనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ)’ ఉండాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. విద్యా సంస్థలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా, సమాజానికి తిరిగి ఎంతో కొంత సాయం చేసే బాధ్యత తీసుకోవాలన్నారు. డిజిటల్ ఇండియా, నేషనల్ క్వాంటమ్ మిషన్ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల స్ఫూర్తితో.. తెలంగాణలోని విద్యాసంస్థలు పరిశోధనల్లో ముందుండాలని కోరారు.
గురువారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) ఆధ్వర్యంలో ‘సెంట్రల్ జోన్ వైస్ చాన్స్ లర్ల సదస్సు 2025-–26’ ప్రారంభమైంది. ‘ఏఐ, క్వాంటమ్ఎనేబుల్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్’ అనే థీమ్‌తో జరుగుతున్న ఈ రెండ్రోజుల సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సహా 6 రాష్ట్రాల నుంచి 100 మందికి పైగా వీసీలు హాజరై భవిష్యత్ విద్యా విధానంపై చర్చించారు.
సదస్సును ప్రారంభించిన అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. టెక్నాలజీ అనేది సమాజంలో అంతరాలను పెంచేదిగా కాకుండా, అందరినీ కలుపుకుపోయేలా ఉండాలని అన్నారు. టెక్నాలజీనిఅందిపుచ్చుకున్నవాళ్లే ప్రపంచాన్ని నడిపిస్తారని చెప్పారు. ‘ప్రస్తుతం మనం 5వ పారిశ్రామిక విప్లవంలో ఉన్నాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ యుగంలో మన విద్యాసంస్థలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా మిగిలిపోకూడదు’ అని సూచించారు.
చిన్న నగరాలే ఆదర్శం..
దేశంలో ఆవిష్కరణలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదని గవర్నర్ గుర్తుచేశారు. టైర్-2, టైర్-3 నగరాల నుంచి ఎక్కువ పేటెంట్లు ఫైల్ అవుతున్నాని, ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనే నినాదానికి ప్రధాని మోదీ 'జై అనుసంధాన్'ను జోడించారని తెలిపారు. మన వర్సిటీలు పరిశోధనలకు ఇంజన్లుగా మారాలని పిలుపునిచ్చారు.
మనం విదేశీ టెక్నాలజీని కొనుక్కొనే వాళ్లుగా కాకుండా, మనమే ప్రొడక్ట్స్ తయారు చేసే స్థాయికి ఎదగాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కొందరి సొత్తు కాకూడదని, ‘ఏఐ ఫర్ ఆల్’ అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, జాతీయ భావం పెంపొందించేలా విద్యా బోధన ఉండాలని వీసీలకు గవర్నర్ సూచించారు.
ఓయూ ఏఐ సెంటర్.. ఇక నేషనల్ హబ్: వీసీ కుమార్ మొలుగరం
ఉస్మానియా యూనివర్సిటీలోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్’ను విస్తరిస్తున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం ప్రకటించారు. ఇకపై ఈ సెంటర్ స్మార్ట్ సిటీలు, రవాణా, హెల్త్ కేర్ సిస్టమ్స్ కోసం పని చేసే జాతీయ స్థాయి హబ్‌గా మారుతుందన్నారు. ఇండియా ఏఐ మిషన్, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా.. విద్యార్థులను కేవలం పట్టభద్రులుగా కాకుండా ‘ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్’లుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు.
రేపటి తరం గ్లోబల్ లీడర్లుగా ఎదగాలంటే ఏఐ ఆధారిత పరిశోధనలే కీలకమని ఏఐయూ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాఠక్ అన్నారు. నైతిక విలువలతో కూడిన టెక్నాలజీని బోధనలో ఎలా వాడాలో ఈ సదస్సు దిశానిర్దేశం చేస్తుందని ఏఐయూ సెక్రటరీ జనరల్ డాక్టర్ పంకజ్ మిట్టల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గడ్డం నరేశ్ రెడ్డి, వివిధ వర్సిటీల వీసీలు పాల్గొన్నారు.
ప్రపంచం ‘టెక్నో- పోలార్’గా మారుతోంది: ప్రొ. బాలకిష్టారెడ్డి
గతంలో ప్రపంచం బై-పోలార్, యూని-పోలార్‌గా ఉండేదని, కానీ భవిష్యత్తు మాత్రం ‘టెక్నో–పోలార్’గా మారబోతోందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. టెక్నాలజీ మనిషికి సౌకర్యాలు పెంచిన మాట వాస్తవమే అయినా.. అది ప్రభుత్వాల సార్వభౌమత్వానికే సవాల్ విసురుతోందని చెప్పారు. సైబర్ క్రైమ్ లాంటి నేరాలకు దేశాల సరిహద్దులు ఉండబోవని, ఇక్కడే కూర్చొని వేరే దేశంలో నేరం చేయొచ్చని పేర్కొన్నారు.
విద్యా వ్యవస్థను ప్రభావితం చేసిన అంశాల్లో గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, డిజిటైజేషన్‌తో పాటు ఇప్పుడు ‘కొవిడైజేషన్’ కూడా చేరిందని చెప్పారు. సామాన్యుడి గుమ్మం వరకు నాణ్యమైన విద్యను తక్కువ ఖర్చుతో అందించడమే టీజీసీహెచ్ఈ లక్ష్యమని స్పష్టం చేశారు.
