దాసోజు, కుర్ర సత్యనారాయణ పొలిటికల్ హిస్టరీ

దాసోజు, కుర్ర సత్యనారాయణ పొలిటికల్ హిస్టరీ
  • గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా.. దాసోజు, సత్యనారాయణ
  • అభ్యర్థులను ఖరారు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం
  • ఇద్దరి పేర్లను గవర్నర్‌‌‌‌ ఆమోదానికి పంపనున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. బీఆర్‌‌‌‌ఎస్‌‌ బీసీ నేత దాసోజు శ్రవణ్ కుమార్, ఎరుకల కులానికి చెందిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ పేర్లకు కేబినెట్‌‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గవర్నర్‌‌‌‌కు ప్రతిపాదన పంపనుంది. ఆ ఇద్దరి పేర్లకు గవర్నర్ ఆమోదముద్ర వేస్తారని ఆశిస్తున్నానని కేబినెట్​భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాము ప్రతిపాదించిన ఇద్దరిలో ఒకరు ఎస్టీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అని, ఇంకొకరు ప్రొఫెసర్ అని పేర్కొన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న రాజేశ్వర్ రావు (క్రిస్టియన్), ఫారూఖ్​హుస్సేన్ (ముస్లిం) పదవీ కాలం మే 27తో ముగిసింది. అప్పటి నుంచి ఈ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు సీట్ల కోసం రెండు డజన్ల మందికి పైగా పోటీ పడ్డారు. తమకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌‌‌‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌‌రావు, ఎమ్మెల్సీ కవితను కలిసి విజ్ఞప్తి చేశారు. కాగా, 2009 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌‌‌‌తో కలిసి దాసోజు శ్రవణ్ పనిచేశారు. 

ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌‌లో చేరారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్‌‌లో చేరారు. పార్టీలో చేరినప్పటి నుంచే శ్రవణ్‌‌కు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమనే చర్చ సాగింది. మరో స్థానాన్ని క్రిస్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీల్లో ఒకరికి ఇవ్వొచ్చని ప్రచారం సాగింది. కానీ, ఆ స్థానానికి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ పేరు ఖరారు చేశారు. 1999లో బీజేపీ అభ్యర్థిగా సంగారెడ్డి నుంచి పోటీ చేసిన సత్యనారాయణ.. కాంగ్రెస్​అభ్యర్థిపై 27 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఆ తర్వాత 2004లో బీఆర్ఎస్ అభ్యర్థి జగ్గారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌‌లో చేరడంతో, తాజాగా ఆయనకు ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు.