V6 News

వర్సిటీలు డిగ్రీలు ఇచ్చే కేంద్రాలు కావొద్దు..స్టూడెంట్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్లు తీర్చిదిద్దాలి : గవర్నర్ శివప్రతాప్ శుక్లా 

వర్సిటీలు డిగ్రీలు ఇచ్చే కేంద్రాలు కావొద్దు..స్టూడెంట్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్లు తీర్చిదిద్దాలి : గవర్నర్ శివప్రతాప్ శుక్లా 
  • వీసీలు కూడా పాఠాలు చెప్పి ఆదర్శంగా నిలవాలి 
  • వీసీల మీటింగ్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా 

హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీలు డిగ్రీలు ప్రదానం చేసే సంస్థలుగా మాత్రమే మిగిలిపోకూడదని, స్టూడెంట్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే నైపుణ్య కేంద్రాలుగా మారాలని రాష్ట్ర గవర్నర్  శివప్రతాప్  శుక్లా అన్నారు. వైస్ చాన్సలర్లు అడ్మినిస్ట్రేటర్లుగానే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును మార్చే దార్శనిక నాయకులుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. వీసీలు కూడా పిల్లలకు పాఠాలు చెప్పాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని లోక్ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రంలోని వర్సిటీల వీసీలు, హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్ అధికారులతో గవర్నర్  సమావేశమయ్యారు.

గవర్నర్  మాట్లాడుతూ విద్యా ర్థుల నైపుణ్యాల పెంపుదల, నిరంతర అభివృద్ధిపై వర్సిటీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఫారిన్  యూనివర్సిటీలు మన కన్నా గొప్పవేమీ కావని స్పష్టం చేశారు. మన దేశంలోని యూనివర్సిటీల్లో చదివిన ఇంజినీర్లు, డాక్టర్లు తమ ట్యాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానాల్లో ఉంటూ దేశానికి గుర్తింపు తెస్తున్నారని గుర్తుచేశారు. యువతను స్వయంసమృద్ధిగా తీర్చిదిద్దడానికి నూతన విద్యా విధానం అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 

పరిశ్రమలతో దోస్తీ.. ఆవిష్కరణలకు ఊతం

రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూ వంటి వర్సిటీల కృషిని గవర్నర్  అభినందించారు. దేశంలోని బెస్ట్  వర్సిటీ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ  వర్సిటీలు టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలవాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి రూపొందించిన ఫ్రమ్  విజన్  టు ఇంపాక్ట్  పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు.

సంస్కరణలను వివరించిన బాలకిష్టారెడ్డి

అంతకుముందు హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  చైర్మన్  ప్రొఫెసర్  వి.బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ...  గత ఏడాది కాలంలో అకాడమిక్  పునర్వ్యవస్థీకరణ, నైపుణ్యాభివృద్ధిలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టామని, అంతర్జాతీయ విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో గవర్నర్  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిశోర్, టీజీసీహెచ్​ఈ వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ తో పాటు వర్సిటీల వీసీలు పాల్గొన్నారు.