టీఎస్​పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ ​ఆమోదించాలి : జీవన్​రెడ్డి

టీఎస్​పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ ​ఆమోదించాలి : జీవన్​రెడ్డి
  • అప్పుడే కొత్త బోర్డు ఏర్పాటుకు అవకాశం
  • .ఎన్నికల కోడ్​ వస్తే జాబ్​ రిక్రూట్​మెంట్​ఆలస్యమైతది
  • నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నరు
  • గవర్నర్​ తమిళిసైకి లేఖ రాసిన ఎమ్మెల్సీ 

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్​ ఆమోదించాలని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి కోరారు. ఈ మేరకు గవర్నర్​తమిళిసైకి లేఖ రాసిన ఆయన.. మంగళవారం గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. టీఎస్​పీఎస్సీ చైర్మన్, సభ్యులు రాజీనామా చేసి నెల రోజులవుతున్నదని, వాటిని గవర్నర్​ఎంత త్వరగా ఆమోదిస్తే అంత త్వరగా కొత్త బోర్డు ఏర్పాటుకు అవకాశం ఉంటుందని అన్నారు. వారి రాజీనామాలను గవర్నర్​ ఆమోదించకపోవడం వల్ల తమ ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నదని చెప్పారు. 

నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని, త్వరలోనే ఎన్నికల కోడ్​కూడా వచ్చే అవకాశం ఉందని, కోడ్​ వస్తే నియామకాలు మరింత లేట్​అయ్యే అవకాశం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారిని తొలగించలేదని, వారే స్వచ్ఛందంగా రాజీనామా చేశారు కాబట్టి.. రాష్ట్రపతికి నివేదించాల్సిన అవసరం ఉండబోదని ఆయన వెల్లడించారు. నియామక పరీక్షల ప్రశ్నాపత్రాలను గత ప్రభుత్వంలోని టీఎస్​పీఎస్సీ అంగట్లో అమ్మకానికి పెట్టిందని జీవన్​రెడ్డి విమర్శించారు. నైతికంగా వారు రాజీనామా చేయాలని, కానీ, అప్పుడు అలా జరగలేదని గుర్తు చేశారు. 

చర్యలు తీసుకోవాల్సిన గత ప్రభుత్వం వారికి వంత పాడిందన్నారు. గత బోర్డు ఎన్నో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. నియామకాల విషయంలో బీఆర్ఎస్​ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ​ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.