రాజ్​భవన్కు రావాలని మంత్రి సబితకు గవర్నర్ తమిళిసై ఆదేశం

రాజ్​భవన్కు రావాలని మంత్రి సబితకు గవర్నర్ తమిళిసై ఆదేశం
  • యూనివర్సిటీస్‌‌ కామన్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు బిల్లుపై సర్కారుకు లేఖ
  • వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలంటే ఎందుకు పట్టించుకోరని ప్రశ్న
  • బిల్లు చెల్లుబాటుపై అభిప్రాయం చెప్పాలని యూజీసీకీ లెటర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడేండ్లుగా యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణ యూనివర్సిటీస్‌‌ కామన్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు బిల్లుపై రాజ్‌‌భవన్‌‌కు వచ్చి చర్చించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. సోమవారం ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డికి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి లెటర్ రాశారు. రాష్ట్ర సర్కారు కొత్తగా తెచ్చిన కామన్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు బిల్లుపై యూజీసీ అభిప్రాయం కోరారు. ఈ బిల్లు చెల్లుబాటు అవుతుందో లేదో తెలియజేయాలని సూచించారు. ఇటీవల విద్యార్థి సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ బిల్లు ఆమోదంపై ఒత్తిడి వస్తున్నది. రెండు రోజుల్లో బిల్లు ఆమోదించకపోతే రాజ్‌‌ భవన్‌‌ ముట్టడిస్తామని తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీకి తమిళిసై లేఖ రాశారు.
న్యాయ సమస్యలు వస్తయా?
తెలంగాణ అసెంబ్లీ, మండలిలో ఇటీవల ఆమోదించిన 7 బిల్లులు ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్‌‌లో ఉన్నాయి. అందులో యూనివర్సిటీస్‌‌ కామన్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు బిల్లు కూడా ఉంది. దీన్ని ఆమోదించడం వల్ల ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తాయా? అలా జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందో చెప్పాలని, రిక్రూట్‌‌మెంట్​పై వివరణ ఇవ్వాలని మంత్రి సబితకు సూచించారు. మూడేండ్లుగా ఖాళీలను భర్తీ చేయాలని తాను చెప్తున్నా.. ఎందుకు పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీలు ఉన్నప్పటికీ ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా కామన్ రిక్రూట్​మెంట్ బోర్డు తీసుకురావడం వల్ల మళ్లీ న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని.. ఉద్యోగాల భర్తీ మరింత ఆలస్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలు దెబ్బ తింటాయని లేఖలో పేర్కొన్నారు.
ఈ బిల్లులూ పెండింగ్‌‌లోనే
నెల రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 8 బిల్లులను తీసుకొచ్చింది. ఇవన్నీ అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం పొందాయి. అందులో రెండు కొత్తవి కాగా.. మిగతా 6 చట్ట సవరణకు సంబంధించినవి. కామన్ రిక్రూట్‌‌మెంట్ బోర్డుతోపాటు సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీగా మారుస్తూ బిల్లును తీసుకొచ్చింది. మరికొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చేలా.. ప్రైవేట్ వర్సిటీ చట్టాన్ని సవరిస్తూ బిల్లు ఆమోదించింది. జీహెచ్ఎంసీ, మున్సిపల్ చట్టాలకు సవరణ చేస్తూ.. మరో బిల్లును తీసుకొచ్చింది. పబ్లిక్ ఎంప్లాయ్‌‌మెంట్ చట్టం, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్టం, జీఎస్టీ చట్టాలను సవరిస్తూ బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చింది. మరొకటి జీఎస్టీకి సంబంధించినది ఉండగా దానికి గవర్నర్ ఆమోదం లభించింది. సాధారణంగా అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తర్వాత బిల్లులను రాజ్‌‌భవన్‌‌కు పంపుతారు. గవర్నర్ వాటిని పరిశీలించి ఆమోదించాక.. గెజిట్ నోటిఫికేషన్‌‌లో ప్రచురించాల్సి ఉంటుంది. అప్పుడు అవి చట్టంగా మారుతాయి.