కేంద్ర పథకాలు అందరికీ అందేలా చూడాలి : తమిళిసై

కేంద్ర పథకాలు అందరికీ అందేలా చూడాలి : తమిళిసై

సికింద్రాబాద్​,వెలుగు : అన్నివర్గాల మహిళల సంక్షేమం దృష్ట్యా ప్రధాని మోదీ పలు అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని గవర్నర్​తమిళి సై తెలిపారు. తెలంగాణలో ప్రారంభమైన వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా బుధవారం గవర్నర్ లాలాపేట మున్సిపల్ గ్రౌండ్ లో పథకాల సమగ్ర సమాచారం అందించే వీడియో వ్యాన్‌‌‌‌‌‌‌‌ను జెండా ఊపి ప్రారంభించారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ.. పీఎం ఉజ్వల యోజన ద్వారా వంట గ్యాస్, ఆయుష్మాన్ భారత్ ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్య సదుపాయం కేంద్రం కల్పించిందన్నారు.

 గ్యారంటీ లేకుండా బ్యాంక్ లోన్లు ఇస్తుందన్నారు. 2025 లోగా టీబీ రహిత భారత్ కు ప్రధాని సంకల్పించారని, వృత్తిరీత్యా వైద్యురాలిగా తాను ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.  పీఎం ఆవాస్ యోజన, అటల్ పెన్షన్ యోజన, ఎంజీఎన్ఆర్ ఈజీఏ, వడ్డీ లేని రుణాలు, వ్యవసాయ సంబంధిత పథకాలపై ఆడియో విజువల్ వ్యాన్లు ప్రజలకు అవగాహన కల్పిస్తాయన్నారు. బుధవారం ప్రారంభమైన యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 25వ తేదీ వరకు కొనసాగనుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు 100 శాతం అందజేయడమే సంకల్ప్‌‌‌‌‌‌‌‌ యాత్ర ముఖ్య ఉద్ధేశమన్నారు.  

వివిధ కేంద్ర ప్రభుత్వ స్టాళ్లను గవర్నర్ సందర్శించారు.  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కేంద్ర పథకాల లబ్ధిదారులను చేరేందుకు, అవగాహన కల్పించేందుకు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా నవంబర్ 15న జార్ఖండ్ నుంచి మల్టీమీడియా వీడియో వ్యాన్లను జెండా ఊపి ప్రధాని  మోదీ వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించారు.